
మరణించీ.. జీవిద్దాం!
● అవయవదానంతో ప్రాణదానం ● పదేళ్లలో నగరంలో 162 మంది అవయవదానం ● నాలుగేళ్లుగా పెరుగుతున్న అవగాహన ● ఈ నెల 7 నుంచి 13 వరకు ప్రపంచ అవయవదాన అవగాహన వారోత్సవాలు
అవయవ దానం చేయాలంటే..
అవయవ దానానికి సమ్మతించిన వారు లిఖిత పూర్వక హామీనిస్తూ ఆస్పత్రులు, రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే జీవన్‌దాన్ సంస్థలో పేర్లు నమోదు చేసుకోవాలి. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు ఖచ్చితంగా చెప్పాలి. ఎందుకంటే ఆ వ్యక్తి మరణానంతరం అవయవ దానానికి సమ్మతించాల్సింది కుటుంబ సభ్యులే. మొత్తం శరీరాన్ని వైద్య పరీక్షల కోసం దానం చెయ్యడానికి అంగీకరిస్తే మరణానంతరం ఆ ప్రక్రియను పూర్తి చేసేందుకు ముందే ఓ వ్యక్తిని నియమించుకోవాలి.
బీచ్‌రోడ్డు: భౌతిక శరీరానికి ప్రాణం ఉన్నంత వరకే విలువ. ఇది ఒకప్పటి మాట. శవాన్ని పార్థివ దేహంగా చెప్పుకునేలా, మరణించాక.. మరో శరీరంలో బతికేందుకు ఉన్న ఏకై క అవకాశం అవయవదానం. సామాన్యులు సైతం అవయవదానంతో ఎందరికో పునర్జీవితమిచ్చి, వారి కుటుంబాల్లో వెలుగులు నింపుతున్నారు. ప్రపంచ అవయవ దాన వారోత్సవాల సందర్భంగా ఈ ప్రత్యేక కథనం.
ఎనిమిది మంది బతుకుల్లో వెలుగు
మెదడు పనిచేయకుండా ఆగిపోయిన స్థితిని బ్రెయిన్ డెడ్‌గా పేర్కొంటారు. అలాంటి వ్యక్తి ఎక్కువ రోజులు బతకడం అసాధ్యం. ఇలా బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి నుంచి 110 వరకు అవయవాలను సేకరించవచ్చు. ప్రస్తుతం మన వద్ద ఉన్న సాంకేతికత ఆధారంగా 8 అవయవాల్ని మాత్రమే తీసుకుంటున్నారు. గుండె, కాలేయం, కిడ్నీలు(2), చిన్నపేగు, ఊపిరితిత్తులు(2), పాంక్రియాస్‌ను బ్రెయిన్ డెడ్ వ్యక్తి నుంచి తీసుకోవచ్చు. కార్నియా, గుండె కవాటాలు, చర్మం, ఎముక కణజాలం, రక్తనాళాలను మాత్రం సహజ మరణం పొందిన వారి నుంచే ఎక్కువగా స్వీకరిస్తారు.
సమయం చాలా తక్కువ..
దాత శరీరం నుంచి తీసిన అవయవాలను అవసరమైన వ్యక్తులకు అమర్చేందుకు ఉండేది కేవలం గంటల సమయమే. అందుకే గ్రీన్ చానల్ ద్వారా వీటిని తరలిస్తారు. గుండె, ఊపిరితిత్తులను బయటకు తీశాక 4 గంటలే వ్యవధి ఉంటుంది. కిడ్నీలకై తే 30 గంటలు, లివర్, పాంక్రియాస్‌ను 12 గంటల్లోపు మరొకరిలో అమర్చాలి. అందరిలోనూ అన్ని సమయాల్లో ఇదే సమయం ఉంటుందని చెప్పలేం. కొన్ని సందర్భాల్లో ఇంత కంటే తక్కువ సమయంలోనే ఆ అవయవాలను అమర్చాలి. లేకుంటే దాన్ని అమర్చాక సదరు వ్యక్తి రోగ నిరోధక వ్యవస్థ దాన్ని తిరస్కరిస్తూ అవయవంపై దాడి చేస్తుంటుంది. అందుకే దాన్ని బ్లాక్ చేసేందుకు మందులిస్తారు. కొన్నిసార్లు ఈ మందులు జీవిత కాలం వాడాల్సి రావొచ్చు.
అవగాహన పెరగాలి
మన దేశంలో మూఢ నమ్మకాల కారణంగా అవయవాలు దానం చేసేందుకు చాలా మంది ముందుకురాని పరిస్థితి. ఒక్క మన రాష్ట్రంలోనే జీవన్ దాన్ ద్వారా ఆధికారికంగా అవయవాల కోసం 5 వేల మంది ఎదురు చూస్తున్నారు. ప్రజల్లో అవయవదానం పట్ల అవగాహన పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందులో భాగంగా ఏటా ఆగష్టు 7 నుంచి 13 వరకు ప్రపంచ అవయదాన అవగాహన వారోత్సవాలను నిర్వహిస్తున్నారు. దీంతో నాలుగేళ్లలో బ్రెయిన్ డెడ్ కేసులు గణనీయంగా పెరిగి, అవయవ దానానికి కుటుంబ సభ్యులు ఆమోదం తెలుపుతున్నారు.
అధికార లాంఛనాలతో అంతిమ వీడ్కోలు
బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి అవయవాలను దానం చేస్తే రాష్ట్ర ప్రభుత్వం అధికార లాంచనాలతో అంతిమ వీడ్కోలు పలుకుతుంది. దహనసంస్కారాల కోసం రూ.10 వేలు తక్షణ సాయం అందిస్తుంది. ప్రశంసా ప్రతం అందించి, కుటుంబ సభ్యులను ఘనంగా సత్కరిస్తుంది.
బతికున్నప్పుడే చేసే అవయవ దానాలు
ఒక మనిషి తన జీవనానికి పెద్దగా ప్రభావం లేకుండా కూడా కొన్ని అవయవాలను దానం చేయొచ్చు. కిడ్నీల్లో ఒకటి, ఊపిరితిత్తులు, కాలేయం, పాంక్రియాస్, పేగు నుంచి కొంత భాగాన్ని నిక్షేపంగా దానం చేయొచ్చు. కొంత భాగం దానం తర్వాత కూడా కణాల వృద్ధి జరిగి, కణజాలం నిర్మితమయ్యే అవకాశం ఉన్న ఏకై క అవయవం కాలేయం. రక్తం, రక్తంలో ప్లేట్‌లెట్స్, మూల కణాలు కూడా దానంగా ఇవ్వదగినవే..!
విశాఖలో అవయవ దాతలు (2015 నుంచి
2025 జూన్ వరకు)
ఆస్పత్రి పేరు దాతలు
కిమ్స్ ఐకాన్ 60
కేర్(రామ్‌నగర్) 35
అపోలో(హెల్త్ సిటీ) 28
మెడికవర్ 16
సెవెన్ హిల్స్ 6
క్వీన్స్ ఎన్‌ఆర్‌ఐ 5
పినాకిల్ 5
విమ్స్ 3
అపోలో(రామ్‌నగర్) 2
ఓమ్ని 1
కేర్ హెల్త్ సిటీ 1
ప్రభుత్వ ఆసుపత్రులపై దృష్టి
బ్రెయిన్ డెడ్ కేసులు ఉన్నప్పటికీ అవయవాల సేకరణకు కొన్ని ఆస్పత్రులు ఆసక్తి చూపట్లేదు. ముఖ్యంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో బ్రెయిన్ డెడ్ కేసులు ప్రకటించట్లేదు. ఈ ఏడాది నుంచి అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో అవయవాలు సేకరించేలా చర్యలు తీసుకుంటున్నాం.ఇప్పటికే కేజీహెచ్‌లో జీవన్‌దాన్ కోసం బృందాలను సిద్ధం చేశాం. ప్రజలకు అవగాహన కల్పించేలా ప్రతి అస్పత్రిలో సైన్ బోర్డులు, హెల్ప్ డెస్క్‌లను ఏర్పాటు చేయనున్నాం.
– డాక్టర్ కె.రాంబాబు,
జీవన్‌దాన్ రాష్ట్ర కో–ఆర్డినేటర్

మరణించీ.. జీవిద్దాం!

మరణించీ.. జీవిద్దాం!