
పాఠశాల మూసివేత చర్యలపై ఆందోళన
కంచరపాలెం: జీవీఎంసీ 56వ వార్డు ఆర్పీపేట స్కూల్ కాంప్లెక్స్ పరిధి కంచరపాలెం ప్రాథమిక పాఠశాల మూసివేతకు కూటమి ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని తల్లిదండ్రులు, విద్యార్థులు, స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. గత ఏడాది వరకు 260 మంది విద్యార్ధులు, 10 మంది టీచర్లుండేవారని, ఇటీవల బదిలీల్లో ఆరుగురు వెళ్లిపోవడంతో కేవలం నలుగురు టీచర్లతో నెట్టుకొస్తున్నారని ఆక్షేపించారు. ఇప్పుడున్న 206 మంది విద్యార్థులకు రెండు నెలలుగా పూర్తి స్థాయిలో తరగతులు జరగట్లేదన్నారు. విలీనం సాకుతో పాఠశాలను మూసేయడానికి విద్యాశాఖ చేస్తున్న ప్రయత్నాలను తల్లిదండ్రులు ధర్నాలు, రాస్తారోకో, నిరసనలతో అడ్డుకుంటున్నా అధికారుల్లో మాత్రం ఎలాంటి దిద్దుబాటు చర్యలు కానరావట్లేదని ఆక్షేపిస్తున్నారు. ఈ నెల 11 నుంచి ఫార్మేటివ్ పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో టీచర్ల కొరతపై వార్డు మాజీ కార్పొరేటర్ బొట్టా ఈశ్వరమ్మ, పాఠశాల కమిటీ చైర్మన్ నాగమణి నేతృత్వంలో గురువారం తల్లిదండ్రులు పాఠశాల వద్ద నిరసన వ్యక్తం చేశారు. పాఠశాల ఆవరణలో నిరసన తెలుపుతున్న తల్లిదండ్రులను బయటకు పంపడంతో.. వారు తమ పిల్లల్ని తీసుకుని పాఠశాల ప్రధాన ద్వారం వద్ద రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. దీంతో కంచరపాలెం సబ్ ఇన్‌స్పెక్టర్ సమీర్, కానిస్టేబుల్ రాంబాబు పాఠశాలకు చేరుకుని విద్యార్థులను పాఠశాల లోపలికి పంపారు. స్కూల్ కాంప్లెక్స్ హెచ్‌ఎం రాజ్యలక్ష్మి సమక్షంలో ఉప విద్యాశాఖాధికారి సోమేశ్వరరావుతో ఫోన్‌లో మాట్లాడారు. పాఠశాలకు డిప్యుటేషన్‌పై టీచర్లను పంపాలన్న డిమాండ్ నేపథ్యంలో ఒకరిని నియమించడంతో తల్లిదండ్రులు శాంతించారు. ఈ సందర్బంగా బొట్టా ఈశ్వరమ్మ మాట్లాడుతూ ప్రజా వేదికలో కలెక్టర్‌కు ఫిర్యాదులు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆక్షేపించారు. ఈ స్కూల్‌ను తరలించినా, మూసేయడానికి ప్రయత్నించినా రాష్ట్ర ప్రభుత్వానికి సరైన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. డీఎస్సీ ఫలితాలను ప్రకటించి, కొత్త ఉపాధ్యాయులను స్కూల్‌కు కేటాయించి, పాఠశాలకు పూర్వవైభవం తీసుకురావాలని డిమాండ్ చేశారు. లేకుంటే పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని తల్లిదండ్రులు ఎస్‌ఎఫ్‌ఐ కమిటీ సభ్యులు హెచ్చరించారు.