
11 నుంచి సీజీఆర్‌ఎఫ్ క్యాంపు కోర్టులు
సీజీఆర్‌ఎఫ్ చైర్‌పర్సన్
సత్యనారాయణ
సాక్షి, విశాఖపట్నం: ఏపీఈపీడీసీఎల్ శ్రీకాకుళం, అనకాపల్లి, అంబేడ్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, పాడేరు సర్కిళ్ల విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారానికి ఈ నెల 11 నుంచి క్యాంపు కోర్టులు నిర్వహించనున్నట్లు విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక (సీజీఆర్‌ఎఫ్) చైర్మన్ విశ్రాంతి జడ్జి బి.సత్యనారాయణ వెల్లడించారు. ఈ నెల 11న పలాస డివిజన్ కాశీబుగ్గ సెక్షన్, 13న నర్సీపట్నం డివిజన్ కోటవురట్ల సెక్షన్, 21న అమలాపురం డివిజన్ మలికిపురం సెక్షన్, 22న భీమవరం డివిజన్ ఉండి సెక్షన్, 29న రంపచోడవరం డివిజన్‌లోని రాజవొమ్మంగి సెక్షన్ కార్యాలయాల్లో ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1.30 వరకు జరిగే క్యాంపు కోర్టులో వినియోగదారులు పాల్గొనవచ్చని తెలిపారు. విద్యుత్ సరఫరాలో అంతరాయాలు, హెచ్చుతగ్గులు, బిల్లుల సమస్యలు, కొత్త సర్వీసుల జారీలో జాప్యం, పేరుమార్పిడి, విద్యుత్ సరఫరా పునరుద్ధరణలో జాప్యం, ట్రాన్స్‌ఫార్మర్ల మార్పిడి తదితర విద్యుత్ సంబంధిత సమస్యలపై వినియోగదారులు ఫిర్యాదులను నేరుగా సీజీఆర్‌ఎఫ్ కమిటీకి తెలియజేయవచ్చన్నారు. అదేవిధంగా విశాఖపట్నం సీతమ్మధారలోని ఏపీఈపీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయంలో ఉన్న సీజీఆర్‌ఎఫ్ కార్యాలయానికి కూడా నేరుగా గానీ, లిఖిత పూర్వకంగాగానీ ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. వినియోగదారులు విద్యుత్ సంబంధిత సమస్యల పరిష్కారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1912 ను సంప్రదించవచ్చని సూచించారు. ఈ సదస్సుల్లో చైర్‌పర్సన్ బి.సత్యనారాయణతో పాటు సీజీఆర్‌ఎఫ్ కమిటీ సభ్యులు ఎస్.రాజబాబు, ఎస్.సుబ్బారావు, ఎన్.మురళీకృష్ణ పాల్గొననున్నారు.