
మార్కెట్లకు శ్రావణ శోభ
జగదాంబ: శ్రావణమాసం మూడో శుక్రవారం వరలక్ష్మీ వత్రం సందర్భంగా నగరం శ్రావణ శోభను సంతరించుకుంది. నగరంలో పూర్ణామార్కెట్, రైతు బజార్లు కిక్కిరిసిపోయాయి. కంచరపాలెం, గోపాలపట్నం, పెందుర్తి, అక్కయ్యపాలెం, మధురవాడ, సీతమ్మధార తదితర ప్రధాన కూడళ్లలో వెలసిన దుకాణాల వద్దకు గురువారం అధిక సంఖ్యలో ప్రజలు తరలి రావడంతో కిటకిటలాడాయి. ఇదే అదనుగా పువ్వులు, పండ్లు, ఇతర పూజా సామగ్రి ధరలకు రెక్కలొచ్చాయి. 100 గ్రాముల పువ్వులు రూ.100–150 మధ్య అమ్మకాలు అమ్మకాలు జరిపారు. అరటిపండ్లు డజను రూ.100కు చేరింది. కొబ్బరికాయలు పరిమాణంలో కాస్త మధ్యస్తంగా ఉన్నవి ఒక్కోటి రూ.50 ధర పలికింది. ఇక పండ్ల ధరల గురించి చెప్పాల్సిన పనిలేదు. కిలో దానిమ్మ రూ.300, యాపిల్ రూ.250, ద్రాక్ష రూ.200, సీతాఫలాలు ఒక్కొక్కటి రూ.40–50 మధ్య విక్రయించారు. పత్రులు, గాజుల దుకాణాలు ఎక్కడికక్కడ వెలిశాయి. ప్రధాన మార్కెట్ల వద్ద జనం కిక్కిరిసి పోవడంతో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తాయి. పూర్ణామార్కెట్ వద్ద బారికేడ్లతో రహదారిని డైవర్ట్ చేయాల్సి వచ్చింది.