
జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం
● వంతెన రక్షణ గోడను ఢీకొన్న కంటైనర్ ● 30 అడుగుల ఎత్తు నుంచి పడి డ్రైవర్ దుర్మరణం
పెందుర్తి : ఆనందపురం–అనకాపల్లి జాతీయ రహదారి–16(బైపాస్) పెందుర్తి సమీపంలోని సరిపల్లి వద్ద బుధవారం జరిగిన ప్రమాదంలో కంటైనర్ డ్రైవర్ దుర్మరణం పాలయ్యాడు. వివరాలివి.. జాతీయ రహదారిపై సబ్బవరం వైపు నుంచి ఆనందపురం వైపు వెళుతున్న కంటైనర్ సరిపల్లి వద్దకు వచ్చేసరికి అదుపు తప్పింది. ఈ క్రమంలో వంతెన రక్షణ గోడ వద్ద ఉన్న విద్యుత్ స్తంభాన్ని బలంగా ఢీకొంది. దీంతో కంటైనర్ డోర్ తెరుచుకోవడంతో డ్రైవర్ రాకేష్‌కుమార్(40) దాదాపు 30 అడుగుల ఎత్తు నుంచి కిందకు పడిపోయాడు. తీవ్ర గాయాలతో అక్కడిక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి విచారణ చేపట్టారు. రాకేష్‌కుమార్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. మృతునిది ఉత్తరప్రదేశ్ రోషన్‌నగర్. అతని బంధువులకు సమాచారం అందించారు. సీఐ కె.వి సతీష్‌కుమార్ ఆధ్వర్యంలో కేసు దర్యాప్తు చేస్తున్నారు.