
రికార్డుల్లో చంపేశారు..
తగరపువలస : భీమిలి మండలం తాళ్లవలస పంచాయతీకి చెందిన మహిళా ఆదర్శ రైతు మామిడి సూరమ్మ ఏడాదిగా అన్నదాత సుఖీభవ కోసం ఎంతో ఆశగా ఎదురుచూసింది. ప్రభుత్వం ఈనెల 2వ తేదీన ఈ పథకం ద్వారా రూ.5 వేలు చొప్పున నిధులను రైతులకు జమ చేయగా ఆమెకు మాత్రం రాలేదు. దీంతో ఆమె రైతు సేవా కేంద్రానికి వెళ్లి సిబ్బందిని అడిగింది. వారు తనిఖీ చేసి సూరమ్మ చనిపోవడం వల్ల రిజెక్ట్ చేసినట్లు తెలిపారు. తాను బతికి ఉండగానే చంపేస్తారా? అని ఆమె సిబ్బందిని నిలదీయగా పొరపాటున అలా జరిగిందని తిరిగి అప్‌లోడ్ చేసి పథకం డబ్బులు అందేలా చూస్తామని చెప్పి పంపించేశారు.
సైన్స్ ఉపాధ్యాయులకు నేటి నుంచి శిక్షణ తరగతులు
ఆరిలోవ: జిల్లాలోని అన్ని యాజమాన్యాల ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల సైన్స్ ఉపాధ్యాయులకు బుధ,గురువారాల్లో ‘ఇన్‌స్పైర్ మనక్–2025’ శిక్షణ తరగతులు డివిజన్ల వారీగా నిర్వహించనున్నట్లు డీఈవో ఎన్.ప్రేమ్‌కుమార్ మంగళవారం పేర్కొన్నారు. ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు డీఈవో కార్యాలయంలోని సమావేశ మందిరంలో శిక్షణ తరగతులు జరగనున్నాయి. బుధవారం ఆనందపురం, పద్మనాభం, భీమిలి, చినగదిలి, సీతమ్మధార మండలాల పాఠశాలల సైన్స్ ఉపాధ్యాయులకు, గురువారం గాజువాక, పెదగంట్యాడ, గోపాలపట్నం, ములగాడ, మహారాణిపేట మండలాల సైన్స్ ఉపాధ్యాయులకు శిక్షణ నిర్వహిస్తామన్నారు.