
మరింత మెరుగ్గా పౌరసరఫరాల సేవలు
మహారాణిపేట: పౌరసరఫరాల శాఖ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో జరిగిన ఉత్తరాంధ్ర జిల్లాల ప్రాంతీయ సదస్సులో ఆయన వివిధ అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. రేషన్ సరుకులను 15 రోజుల పాటు పంపిణీ చేయాలన్నారు. 65 ఏళ్లు దాటిన వృద్ధులు, దివ్యాంగులకు ప్రతి నెలా 26–30 తేదీల మధ్య ఇళ్ల వద్దకే సరుకులను అందించాలని ఆదేశించారు. దీపం పథకంలో సాంకేతిక సమస్యలను పరిష్కరించి, అర్హులందరికీ లబ్ధి చేకూరేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. గ్యాస్ సిలిండర్ డెలివరీ సమయంలో ప్రజల నుంచి అదనపు చార్జీలు వసూలు చేస్తున్న డీలర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ నెల 25న స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీకి శ్రీకారం చుడతామన్నారు. మధ్యాహ్న భోజన పథకంలో స్థానికంగా పండే ధాన్యాన్ని వినియోగించేందుకు ప్రణాళికలు పంపించాలని జేసీలను మంత్రి ఆదేశించారు.
ఫ్లెక్సీలు, క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేయాలి
రేషన్ దుకాణాల వద్ద పూర్తి వివరాలతో కూడిన ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని, అలాగే క్యూఆర్ కోడ్ ద్వారా ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరించాలని మంత్రి మనోహర్ ఆదేశించారు. డీలర్లు ఏజెన్సీల ద్వారా వచ్చే కమిషన్ మాత్రమే తీసుకోవాలని, ప్రజల నుంచి అదనపు చార్జీలు వసూలు చేయకూడదని స్పష్టం చేశారు. అలాగే డిజిటల్ చెల్లింపుల విధానాన్ని ప్రోత్సహించాలన్నారు. వలసదారుల వివరాలను సేకరించి, వారికి అనుగుణంగా రేషన్ సరుకులు పంపిణీ చేయాలని సూచించారు. సన్న బియ్యం వచ్చే వరకు పాఠశాలలు, ఎండీయూ వాహనాల వద్ద ఉన్న పాత బియ్యాన్ని ఉపయోగించరాదని స్పష్టం చేశారు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్ సౌరభ్ గౌర్ వివిధ అంశాలపై అధికారులకు సూచనలు చేశారు. జేసీ కె. మయూర్ అశోక్, జీసీసీ ఎండీ కల్పనా కుమారి, అనకాపల్లి జేసీ ఎం. జాహ్నవి, విజయనగరం జేసీ సేతుమాధవన్, శ్రీకాకుళం జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, విశాఖ డీఎస్‌వో భాస్కరరావు, ఇతర జిల్లాల డీఎస్‌వోలు, డీఎంలు, లీగల్ మెట్రాలజీ, ఫుడ్ సేఫ్టీ అధికారులు, బీపీసీఎల్, ఐవోసీఎల్, హెచ్‌పీసీఎల్ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.
పౌర సరఫరాల శాఖ మంత్రి మనోహర్