
కోస్తాంధ్ర తీర ప్రాంత రక్షణకు చర్యలు
ఆరిలోవ : రాష్ట్రంలో కోస్తాంధ్ర తీర ప్రాంత రక్షణకు చర్యలు చేపడుతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, విశ్రాంత ఐఎఫ్‌ఎస్ ఆఫీసర్ పి.మల్లికార్జునరావు తెలిపారు. రెండు రోజులపాటు విశాఖ ఫారెస్ట్ సర్కిల్ సందర్శనలో భాగంగా మంగళవారం ఆయన ఇందిరాగాంధీ జూలాజికల్ పార్కు, కంబాలకొండ ఎకో టూరిజం పార్క్‌ను సందర్శించారు. అనంతరం జూ సమావేశ మందిరంలో అటవీశాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. విశాఖ రీజియన్‌లో అడవుల సంరక్షణ, వాటి అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్’గా తీర ప్రాంతాన్ని తీర్చిదిద్దడానికి సన్నాహాలు జరుగుతున్నాయన్నారు. ఇందులో భాగంగా కోస్తాంధ్ర 12 జిల్లాల్లో ఉన్న 974 కి.మీ తీర ప్రాంతంలో సుమారు 600 కి.మీల్లో పలచబడిన పచ్చదనాన్ని పునరుద్ధరించనున్నట్లు పేర్కొన్నారు. ఈ తీర ప్రాంతమంతటా 2 లక్షల తాటి విత్తనాలు నాటనున్నామన్నారు. వాటితోపాటు ఖర్జూరం, ఈత తదితర మొక్కలు కూడా నాటించే ఆలోచనలో ఉన్నట్లు పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో 344 కి.మీ తీర ప్రాంతం ఉందని, ఇక్కడి వాతావరణం ఆధారంగా ఎలాంటి మొక్కలు నాటా లో అధ్యయనం చేస్తున్నామన్నారు. పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లాల్లో అడవుల నుంచి వచ్చి రైతుల పంటలను నాశనం చేస్తున్న ఏనుగుల నుంచి రక్షించడానికి రెండు కుంకి ఏనుగులను తీసుకురానున్నట్లు పేర్కొన్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో ఏటికొప్పాక బొమ్మల తయారీ కోసం వినియోగించే అంకుడు తదితర కలపను అటవీశాఖ నుంచి సరఫరా చేసే ఆలోచన చేస్తున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో విశాఖ రీజియన్ సీఎఫ్ మైథీన్, జూ క్యూరేటర్ జి.మంగమ్మ, డీఎఫ్‌వోలు, సబ్ డీఎఫ్‌వోలు పాల్గొన్నారు.