
స్మార్ట్ మీటర్ల ఏర్పాటు తక్షణమే ఆపాలి
● సర్దుబాటు, ట్రూఅప్, ఇంధనపు చార్జీలను ఉపసంహరించుకోవాలి ● ఏపీఈపీడీసీఎల్ ఎదుట ప్రజా సంఘాల ధ ర్నా
తాటిచెట్లపాలెం: విద్యుత్ గృహ వినియోగదారులకు నష్టదాయకమైన విద్యుత్ స్మార్ట్ మీటర్ల బిగింపును తక్షణమే నిలిపివేయాలని, ప్రజలపై మోపిన ట్రూ–అప్ చార్జీలు, ఇంధనపు చార్జీలను వెంటనే ఉపసంహరించుకోవాలని విశాఖ కార్మిక, మహిళా, యువజన, విద్యార్థి ప్రజా సంఘాల ఐక్యవేదిక డిమాండ్ చేసింది. మంగళవారం సీతమ్మధారలోని ఏపీఈపీడీసీఎల్ కార్యాలయం ముందు సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎఫ్‌టీయూ, ఏఐఎఫ్‌టీయూ, ఐద్వా, ఎన్‌ఐఎఫ్‌డబ్ల్యూ, పీఓడబ్ల్యూ, డీవైఎఫ్‌ఐ, ఏఐవైఎఫ్, కేవీపీఎస్ వంటి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు. ఐద్వా జిల్లా అధ్యక్షురాలు బి.పద్మ, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి జీఎస్ అచ్యుతరావుల అధ్యక్షతన జరిగిన ఈ ధర్నాలో సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు కె. లోకనాథం మాట్లాడుతూ కేంద్ర బీజేపీ ప్రభుత్వం విద్యుత్ సంస్కరణల పేరుతో విద్యుత్ కంపెనీలను అదానీ వంటి బహుళజాతి సంస్థలకు కట్టబెడుతుంటే, రాష్ట్రంలో కూటమి నేతలు దానికి సహకరించడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. ప్రజల సంపదను లూటీ చేయడమే కాకుండా, వారిపై విద్యుత్ భారాలు మోపడం సరికాదని హెచ్చరించారు. 2000 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు భారీగా విద్యుత్ చార్జీలు పెంచినప్పుడు ప్రజలు ఐక్యంగా తిప్పికొట్టారని, చలో హైదరాబాద్ నిర్వహించినప్పుడు చంద్రబాబు ప్రభుత్వం ముగ్గురిని పొట్టన పెట్టుకుందని గుర్తు చేశారు. ఇప్పుడు మరో విద్యుత్ పోరాటానికి ప్రజలు సిద్ధం కావాలని కోరారు. ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి రెహమాన్, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్కేవీఎస్‌వీ కుమార్, ఐఎఫ్‌టీయూ రాష్ట్ర నాయకులు ఎం. వేంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు లోకేష్ స్మార్ట్ మీటర్లు బిగిస్తే బద్దలు కొట్టాలని చెప్పారని గుర్తు చేశారు. మరి ఇప్పుడు అధికారంలోకి వచ్చాక దొంగచాటుగా మీటర్లు ఎందుకు బిగిస్తున్నారని ప్రశ్నించారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఎం. జగ్గునాయుడు, పీఓడబ్ల్యూ లక్ష్మీ, ఏఐఎఫ్‌టీయూ జిల్లా కార్యదర్శి దేవ, డీవైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు యు.ఎస్.ఎన్. రాజు, ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి వై. సత్యవతి, ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యూ జిల్లా నాయకురాలు వనజాక్షి, కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు వై. రాజు, ఏఐవైఎఫ్ నాయకుడు అచ్యుతరావు, 78వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ బి. గంగారావు, ఇతర ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.