
ఈతకు వెళ్లిన వ్యక్తి మృతి
కూర్మన్నపాలెం: సరదాగా ఈతకు వెళ్లిన అనకాపల్లి మండలం గోపాలపురం గ్రామానికి చెందిన కర్రి నాగేశ్వరరావు (29) అనే యువకుడు మృతి చెందాడు. మంగళవారం ఉదయం అతని మృతదేహం తిక్కవానిపాలెం సముద్రతీరంలో లభ్యమైంది. దువ్వాడ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగేశ్వరరావు ఈ నెల 3న ఇంటి నుంచి బయటకు వెళ్లి, తిక్కవానిపాలెం బీచ్‌లో ఈత కోసం సముద్రంలో దిగాడు. అయితే ఒక్కసారిగా వచ్చిన అలల తాకిడికి కొట్టుకుపోయి గల్లంతయ్యాడు. ఆ రోజు రాత్రి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు చుట్టుపక్కల ప్రాంతాల్లో, బంధువుల ఇళ్లలో వెతికారు. ఆచూకీ లభించకపోవడంతో అనకాపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మంగళవారం ఉదయం తిక్కవానిపాలెం బీచ్‌లో మృతదేహం ఉందని స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. కుటుంబ సభ్యులు వెళ్లి చూడగా అది నాగేశ్వరరావుగా గుర్తించారు. మృతుడి సోదరుడు నూక అప్పారావు ఫిర్యాదు మేరకు దువ్వాడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నాగేశ్వరరావు మైలాన్ కంపెనీలో పనిచేస్తున్నాడు. అతనికి భార్య సంధ్య, తల్లి నూకరత్నం ఉన్నారు. ఐదేళ్ల క్రితం అతనికి వివాహమైందని బంధువులు తెలిపారు.