
మూర్తియాదవ్ బ్లాక్ మెయిలర్
● జనసేన కార్పొరేటర్ తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు.. ● ఎండాడలో 5.10 ఎకరాల భూమికి తనకు సంబంధం లేదు ● ఆరోపణలపై విచారణ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా.. ● వీఎంఆర్‌డీఏ మాజీ చైర్మన్ చంద్రమౌళి
సాక్షి, విశాఖపట్నం : జనసేన కార్పొరేటర్ పీతల మూర్తియాదవ్ ఒక బ్లాక్ మెయిలర్ అని వీఎంఆర్‌డీఏ మాజీ చైర్మన్ సనపల చంద్రమౌళి మండిపడ్డారు. ఎండాడలో సర్వే నెంబర్ 14/1లో 5.10 ఎకరాల భూమిని పోర్జరీ పత్రాలతో తాను కాజేశానంటూ ఆరోపణలు పచ్చి అబద్ధమని, ఆ భూమికి తనకు ఎటువంటి సంబంధం లేదన్నారు. తనపై చేసిన ఆరోపణలకు ఆధారాలు చూపించాలని.. లేదంటే మూర్తియాదవ్‌పై పరువు నష్టం దావా వేయడానికి కూడా వెనుకాడనని హెచ్చరించారు. తనపై వచ్చిన ఆరోపణలపై విచారణ చేయాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నానన్నారు. మంగళవారం మద్దిలపాలెంలో వైఎస్సార్ సీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. మాజీ సైనిక ఉద్యోగి వై.బాలిరెడ్డికి జీవో నెంబర్ 743/1963 ప్రకారం ప్రభుత్వం ల్యాండ్ అలాట్‌మెంట్ పథకం ద్వారా 1971లో డి.ఆర్. నెంబర్ 5/1381 ద్వారా అసైన్డ్ డీ పట్టా (మాజీ సైనిక ఉద్యోగి కోటా) ఇచ్చారన్నారు. తదుపరి ప్రభుత్వం జీవో నెంబర్ 1117/1993 ద్వారా అసైన్డ్‌మెంట్ చేసిన పదేళ్ల తర్వాత ఎటువంటి ఎన్‌వోసీ లేకుండా సేల్ చేయవచ్చని స్పష్టం చేసిందన్నారు. ఆ భూమికి 2022 మే 4వ తేదీన సీసీఎల్‌ఏ 350/ 2022 ప్రకారం ఎక్స్ సర్వీస్‌మెన్ సేల్స్ పర్మిషన్‌లో కొన్ని గైడ్లైన్స్ ప్రకారం కలెక్టర్ ఎన్‌వోసీ ఇచ్చారన్నారు. దానిలో భాగంగా ఎక్స్ సర్వీస్‌మెన్ అయిన వై.బాలిరెడ్డి భార్య ఆనందమ్మ, ఆయన కుమారుడు జోజిరెడ్డి వీలునామా ద్వారా సంక్రమించిన ఆస్తికి కలెక్టర్ ఎన్‌వోసీ కోరడం జరిగిందన్నారు. సంబంధిత రెవెన్యూ డాక్యుమెంట్లను పరిశీలించి విచారణ చేపట్టి ఆనందమ్మకు డీ–పట్టా అలాట్ చేయవచ్చా? లేదా అనేది క్లారిఫికేషన్ వచ్చిన తరువాత ఓపినియన్ కోసం గవర్నమెంట్ ప్లేడర్‌కి పంపించడం జరిగిందన్నారు. ఎన్‌వోసీ వచ్చిన తర్వాత వీలునామా ప్రకారం 376 సెంట్లు జోజిరెడ్డి డెవలప్‌మెంట్ చేసుకోవడానికి హైదరాబాద్‌కు చెందిన వారికి ఇవ్వడం జరిగిందన్నారు. ఆ భూమికి తనకు ఎటువంటి సంబంధం లేదని.. కాదని ఆధారాలు చూపిస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్ విసిరారు. ఎప్పుడూ ఎవరొకరిపై తప్పుడు ఆరోపణలు చేసుకుంటూ బ్లాక్‌మెయిల్ చేసే మూర్తియాదవ్ లాంటి వ్యక్తులు రాజకీయాలు పనికిరారన్నారు.