
ఆటో కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
బీచ్‌రోడ్డు : రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం వల్ల ఆటో కార్మికులకు ఆదాయం తగ్గుతూ ఆర్థికంగా ఇబ్బంది పడతారని.. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఆటో కార్మికుల నాయకులతో చర్చించి న్యాయం చేయాలని ఆటో కార్మికులు డిమాండ్ చేశారు. మంగళవారం విశాఖ ఆటో రిక్షా కార్మిక సంఘం ఆధ్వర్యంలో గాంధీ విగ్రహం దగ్గర ధర్నా చేశా రు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కె.సత్యనారాయణ మాట్లాడుతూ ఇప్పటికే ఆటో కార్మికులు జీవో నెంబర్ 21 వచ్చిన దగ్గర నుంచి అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. యువగళం పాదయాత్ర సమయంలో లోకేష్ ఇచ్చిన హామీ మేరకు ఆటో కార్మికులకు వాహన మిత్ర పథకం ద్వా రా రూ.15 వేలు ఇవ్వాలని, వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని, పెట్రోల్ డీజిల్ ఆటో కార్మికులకు సబ్సిడీ ధరలకు ఇవ్వాలని, ప్రభుత్వం ప్రత్యేక యాప్ తీసుకువచ్చి ఓలా, ఉబర్, రాపిడో వారి నుంచి కాపాడాల డిమాండ్ చేశారు. వీటిపై ప్రభుత్వం స్పందించకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 11వ తేదీన ఉద్యమిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ ఆటో స్టాండ్‌ల అధ్యక్షులు గణేష్, కోశాధికారి రాము, ఆలీ, రమణ, గాజువాక ఆటో కార్యదర్శి రమణ పాల్గొన్నారు.