
జగదాంబ రాంబాబు కన్నుమూత
డాబాగార్డెన్స్: జగదాంబ థియేటర్ అధినేత వేగి రాంబాబు మంగళవారం మృతి చెందారు. ఆయన మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా జగదాంబ థియేటర్‌కు ఒక ప్రత్యేక గుర్తింపు తీసుకురావడంలో ఆయన కృషి ఎంతో ఉంది. ఇటీవల ఉత్తమ సింగిల్ స్క్రీన్ ఆఫ్ ఇండియా – 2025 అవార్డు కూడా జగదాంబ థియేటర్ గెలుచుకుంది.
జగదాంబ థియేటర్ విశేషాలు
1970లో చైన్నెకి చెందిన ప్రసిద్ధ నిర్మాణ నిపుణుడు కేఎన్ శ్రీనివాసన్ పర్యవేక్షణలో 4,200 చదరపు అడుగుల విస్తీర్ణంలో దీనిని నిర్మించారు. 70 ఎంఎం ప్రదర్శన వ్యవస్థను కనిపెట్టిన ఏవో టాడ్ సూచనల మేరకు ఈ థియేటర్‌ను నిర్మించారు. ఇందులోని వలయాకారపు ర్యాంప్ అప్పట్లో ఒక ప్రత్యేక ఆకర్షణగా ఉండేది. 1200 సీటింగ్ సామర్థ్యంతో ఉన్న ఈ థియేటర్‌ను 1970 అక్టోబర్ 25న అప్పటి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జేవీ నర్సింగరావు ప్రారంభించారు. తొలి చిత్రంగా ‘వేర్ ఈగిల్స్ డేర్’ అనే ఆంగ్ల సినిమా ప్రదర్శించారు. జగదాంబ థియేటర్ ప్రాంగణంలోనే శారదా, రమాదేవి థియేటర్లను నిర్మించారు. ఇది విశాఖలోనే తొలి మల్టీప్లెక్స్‌గా గుర్తింపు పొందింది. వైజాగ్‌లో ల్యాండ్ మార్క్స్ అంటే బీచ్, కై లాసగిరితో పాటు జగదాంబ సెంటర్‌కూగా గుర్తుకువస్తుంది.