
అధికారుల నిర్లక్ష్యం వల్లే అర్జీల రిపీట్
● తీరు మార్చుకోకపోతే చర్యలు తప్పవు ● అధికారులపై అసహనం వ్యక్తం చేసిన కలెక్టర్ ● పీజీఆర్‌ఎస్‌కు 304 వినతులు
మహారాణిపేట: ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్)పై ప్రజల నుంచి అసంతృప్తి వ్యక్తమవుతున్న నేపథ్యంలో కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫిర్యాదులను సరిగా పరిష్కరించడం లేదని, అందుకే చాలా కేసులు మళ్లీ రీ–ఓపెన్ అవుతున్నాయని ఆయన మందలించారు. సంబంధిత అధికారులు తగిన శ్రద్ధ చూపకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో జరిగిన పీజీఆర్‌ఎస్ కార్యక్రమంలో కలెక్టర్, జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్, డీఆర్‌వో భవానీ శంకర్‌లతో కలిసి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. మొత్తం 304 వినతుల్లో రెవెన్యూకు సంబంధించి 80, జీవీఎంసీ 66, పోలీస్ శాఖకు 22, ఇతర సమస్యలకు 136 ఫిర్యాదులు అందాయి. ఫిర్యాదుదారులకు ఫోన్ చేసి సమస్యను తెలుసుకోవాలన్నారు. అవసరమైతే క్షేత్రస్థాయి పరిశీలన చేసి నాణ్యమైన పరిష్కారం చూపాలని, పరిష్కరించిన ఫిర్యాదులకు తగిన విధంగా ఎండార్స్‌మెంట్ వేయాలన్నారు. కాల్ సెంటర్ పనితీరును మెరుగుపడాలని సూచించారు. అధికారులు ప్రత్యేక శ్రద్ధతో పనిచేసి ప్రజా సమస్యలను సంతృప్తికరంగా పరిష్కరించాలని కలెక్టర్ సూచించారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
ముస్లింల సమస్యలపై అధికారుల నిర్లక్ష్యం
ఈద్గా, కబరిస్తాన్ (ముస్లిం శ్మశానవాటికలు) మంజూరు చేయాలని కోరుతూ అనేక సార్లు పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదులు చేశా..అధికారుల నుంచి ఎలాంటి స్పందన లేదు. అలాగే వక్ఫ్ బోర్డు భూములపై రీసర్వే చేయాలని, మైనారిటీల ప్రధాన సమస్యలపై సమీక్షా సమావేశం నిర్వహించాలని కోరినా ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. తమ వినతులను తక్షణమే పరిష్కరించాలి.
– షేక్ బాబ్జి, వైఎస్సార్ సీపీ జిల్లా
సమాచార హక్కు చట్టం అధ్యక్షుడు.

అధికారుల నిర్లక్ష్యం వల్లే అర్జీల రిపీట్