
కదంతొక్కిన జర్నలిస్టులు
మహారాణిపేట: ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ (ఏపీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జిల్లాకు చెందిన జర్నలిస్టులు సోమవారం కలెక్టరేట్ ఎదుట నిరసన ప్రదర్శన నిర్వహించారు. సుమారు 14 డిమాండ్లతో జర్నలిస్టులు నినాదాలు చేసి, అనంతరం కలెక్టర్ హరేందిర ప్రసాద్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ ఈ నెల 6న జరగబోయే మంత్రివర్గ సమావేశంలో జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి తీర్మానాలు ఆమోదించాలని ప్రభుత్వాన్ని కోరారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, అక్రిడిటేషన్లు, బీమా సదుపాయం, పింఛన్లు జారీ చేయడం అవసరమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తమ న్యాయమైన కోర్కెలను పరిష్కరించకపోతే, ఉద్యమాలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. ఇప్పటికే రాష్ట్ర మంత్రులకు విశాఖలో జర్నలిస్టుల సమస్యలను వివరించామని శ్రీనుబాబు తెలిపారు. ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్షుడు పోతుమహంతి నారాయణ్ మాట్లాడుతూ జర్నలిస్టులకు ఏసీ బస్సుల్లో ప్రయాణించే సదుపాయం, ప్రమాద బీమా పథకం అమలు చేయాలని, సమాచార శాఖ అన్ని విధాలా సహకరించాలని కోరారు. మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలి, రైల్వే పాసులు జారీ చేయాలని, అక్రిడిటేషన్ కమిటీలలో జర్నలిస్టుల సంఘాలకు ప్రాతినిధ్యం కల్పించాలని, జర్నలిస్టుల కోసం వృద్ధాశ్రమాలు ఏర్పాటు చేయాలని జర్నలిస్టుల ప్రతినిధులు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా కార్యదర్శి జి. శ్రీనివాస్, డిప్యూటీ జనరల్ సెక్రెటరీ ఎ. సాంబశివరావు, ఆర్గనైజింగ్ సెక్రెటరీ పీఎస్ ప్రసాద్, బ్రాడ్‌కాస్ట్ జర్నలిస్టుల అసోసియేషన్ అధ్యక్షుడు ఈరోతి ఈశ్వరరావు, స్మాల్ అండ్ మీడియం పేపర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వీఎస్. జగన్మోహన్, జర్నలిస్టులు పాల్గొన్నారు.