
అద్దె గర్భం.. అడ్డగోలు దందా
మహారాణిపేట: సంతానం కోసం పరితపించే దంపతుల ఆశను ఆసరాగా చేసుకుని నగరంలోని కొన్ని ఐవీఎఫ్, సరోగసీ కేంద్రాలు అడ్డగోలుగా దోపిడీకి పాల్పడుతున్నాయన్న ఆరోపణలు నిజమవుతున్నా యి. సృష్టి ఐవీఎఫ్ సెంటర్‌లో అక్రమాలు వెలుగుచూసిన నేపథ్యంలో డీఎంహెచ్‌వో పి.జగదీశ్వరరావు ఆధ్వర్యంలో రంగంలోకి దిగిన నాలుగు ప్రత్యేక బృందాల తనిఖీల్లో వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి.
జిల్లాలో మొత్తం 53 సంతాన సాఫల్య కేంద్రాలు (44 ఐవీఎఫ్, 9 సరోగసీ) ఉన్నాయి. వివాహమై ఏళ్లు గడిచినా మాతృత్వానికి నోచుకోలేదన్న బాధతో ఉన్న మహిళలే ఈ కేంద్రాల లక్ష్యం. పిల్లలు లేరన్న బాధ నుంచి దూరం చేయడం కోసం ఈ సెంటర్లు అక్రమా లకు కేంద్ర బిందువుగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో డీఎంహెచ్‌వో ఆధ్వర్యంలో డాక్టర్ ఉమావతి, డాక్టర్ సమత, డాక్టర్ లూసీ వంటి అధికారులతో కూడిన నాలుగు బృందాలు ఈ సెంటర్లలో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నాయి. మరో రెండు, మూడు రోజుల్లో ఈ తనిఖీలు పూర్తికానున్నాయి.
తనిఖీల్లో విస్తుపోయే నిజాలు
● పిల్లల కోసం వచ్చే దంపతుల నుంచి రూ.20 లక్షల నుంచి రూ.40 లక్షల వరకు నగదు రూపంలో వసూ లు చేస్తున్నారు. ఈ భారీ మొత్తాలకు ఎలాంటి రశీదు లు ఇవ్వకపోవడం, అకౌంట్లలో నమోదు చేయకపోవడం వంటి ఆర్థిక అవకతవకలను గుర్తించారు.
● సెంటర్‌కు వచ్చే దంపతులు ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. ప్రతిచోటా సీసీ కెమెరాలు, ప్రత్యేక సిబ్బందిని నియమించి.. ఒక రోగి వివరాలు మరో రోగికి తెలియకుండా అత్యంత రహస్యం పాటిస్తున్నారు. దీని వల్ల ఒకరి నుంచి ఎంత వసూలు చేస్తున్నారో మరొకరికి తెలిసే అవకాశం లేకుండా పోతోంది.
● నూరు శాతం గ్యారెంటీ, లేదంటే డబ్బులు వాపస్ వంటి మోసపూరిత ప్రకటనలతో పిల్లలు లేరన్న తీవ్రమైన మానసిక వేదనలో ఉన్న తల్లిదండ్రులను ఆకర్షించి, వారి బలహీనతను సొమ్ము చేసుకుంటున్నారు. సరోగసీ, ఐవీఎఫ్ పేర్లతో ఈ కేంద్రాలు సాగిస్తున్న నిలువు దోపిడీపై పూర్తిస్థాయి నివేదిక వచ్చిన తర్వాత కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు. ఈ తనిఖీలు పూర్తయితే ఇంకెన్ని అక్రమాలు బయటపడతాయోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది.
దోపిడీ కేంద్రాలుగా ఐవీఎస్, సరోగసీ కేంద్రాలు