
వృద్ధురాలిని రక్షించినమైరెన్ పోలీసులు
కొమ్మాది: సాగర్‌నగర్ బీచ్‌లో ఆత్మహత్యాయత్నం చేసుకునేందుకు ప్రయత్నించిన ఓ వృద్ధురాలిని మైరెన్ పోలీసులు కాపాడారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న గొరల కళావతి ఆదివారం సాయంత్రం ఆత్మహత్య చేసుకునే ఉద్దేశంతో సముద్రంలోకి దిగుతుండగా.. అక్కడ విధులు నిర్వహిస్తున్న మైరెన్ కానిస్టేబుల్ వెంకట గణేష్ గమనించారు. వెంటనే లైఫ్‌గార్డ్ బుజ్జి సహాయంతో ఆమెను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. తీవ్ర అనారోగ్య సమస్యల కారణంగా బాధను తట్టుకోలేక ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు ఆ వృద్ధురాలు పోలీసులకు తెలిపింది. అనంతరం ఆమె వివరాలు సేకరించి ఆరిలోవ పోలీస్ స్టేషన్ బీచ్ మొబైల్ సిబ్బందికి అప్పగించారు. సమయస్ఫూర్తితో వ్యవహరించి వృద్ధురాలి ప్రాణాలను కాపాడిన కానిస్టేబుల్ వెంకట గణేష్‌ను, లైఫ్‌గార్డ్ బుజ్జిని మైరెన్ సీఐ శ్రీనివాసరావు అభినందించారు.