
చందన స్వరూపునికి సంపెంగ సుగంధం
● సింహగిరి సంపెంగల విశిష్టతే వేరు... ● ఏటా జూలై, ఆగస్టు నెలల్లో విరివిగా సింహగిరి సంపెంగలు
సింహాచలం: శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామికి సంపెంగ పుష్పాలంటే ఎంతో ప్రీతి. భక్తసులభుడైన ఆయనకు ఎన్ని రకాల పుష్పాలతో పూజచేసినా...సంపెంగ పుష్పాలతో చేసిన పూజసాటి రాదంటారు. సంపెంగపూలతో పూజ చేస్తే ఆయన ఎంతగానో పరవశించిపోతాడు. సాక్షాత్తూ ఆయన వెలసిన సింహాచలం క్షేత్రంలోనే సంపెంగపూలు కూడా విరివిగా లభిస్తుంటాయి. ఎన్నిచోట్ల సంపెంగలు లభించినా సింహగిరిపైన లభించే సంపెంగకి ఎంతో విశిష్టత ఉందని అభివర్ణిస్తుంటారు.
సింహాచలం కొండపైన, కొండ దిగువన ఉన్న పూలతోటలో, దేవస్థానానికి చెందిన శ్రీకృష్ణాపురం గోశాలలో సంపెంగ చెట్లు ఉన్నాయి. ముఖ్యంగా తెలుపు, పసుపు రంగుల సంపెంగ పూల చెట్లు కనువిందు చేస్తుంటాయి. ఈ పుష్పాల నుంచి వెలువడే సువాసనలు ఎంత దూరంలో ఉన్నా ఆకట్టుకుంటాయి. చందన స్వరూపుడైన సింహాచలేశుడు ఏడాది పొడవునా చందనం పరిమళాలను ఆస్వాదిస్తాడు. ఆ చందనం పరిమళాలకు సమానంగా సంపెంగ పరిమళాలను మాత్రమే స్వామి ఆస్వాదిస్తుంటాడని భక్తులు పేర్కొంటారు. సంపెంగ పూలతో స్వామికి ఉన్న బంధం విడదీయరానిదిగా చెబుతారు.
శ్రీకాంత కృష్ణమాచార్యులు–సంపెంగ బంధం
తొలి తెలుగు వాగ్గేయకారుడిగా ప్రసిద్ధి చెందిన శ్రీకాంత కృష్ణమాచార్యులు (కృష్ణమయ్య), తిరుమల అన్నమాచార్యుల వలె సింహాచలంలో విశేష కీర్తి ప్రతిష్టలు పొందారు. సింహాచలేశుడిపై ఆయన చాతుర్లక్ష వచన సంకీర్తనలు రచించారని, ఆయన కీర్తిస్తుంటే స్వయంగా స్వామి నృత్యం చేసేవాడని చెబుతారు. కృష్ణమయ్య ప్రతిభను గుర్తించిన ఓరుగల్లు సామ్రాజ్యాధినేత ప్రతాప రుద్రుడు కృష్ణమయ్య దంపతులను తన రాజ్యానికి ఆహ్వానించాడు. అక్కడ రాజమర్యాదలు అందుకున్నప్పటికీ, కృష్ణమయ్య భార్యకు సంతృప్తి కలగలేదు. సింహాచలంలో స్వామిని సంపెంగ పూలతో కొలిచేదానినని, తనకు సంపెంగ పూలు తప్ప మరేమీ వద్దని ఆమె చక్రవర్తిని కోరింది. దీంతో ప్రతాపరుద్రుడు రాజభటులను సింహాచలం పంపి సంపెంగ పుష్పాలను తెప్పించాడని దివంగత నాటక రచయిత విరియాల లక్ష్మీపతి తన నాటకంలో అభివర్ణించారు.
సంపెంగల సంరక్షణ, వినియోగం
సంపెంగ పుష్పాలను ఎక్కువ రోజులు నిల్వ ఉంచడానికి కొన్ని పద్ధతులున్నాయి. గాజు సీసాలో పువ్వులు వేసి, మంచి నీటితో నింపి, గాలి చొరబడకుండా సీల్ చేస్తే చాలా ఏళ్లు తాజాగా ఉంటాయని చెబుతారు. వీటిని ఇంట్లో అలంకారంగా కూడా ఉపయోగిస్తారు. సంపెంగ పుష్పాలు ముఖ్యంగా జూలై, ఆగస్టు నెలల్లో పెద్ద మొత్తంలో లభిస్తాయి. వర్షాలు ఎక్కువగా పడితే పువ్వుల పరిమాణం కూడా పెద్దదిగా ఉంటుందని అంటారు. సింహగిరికి వచ్చే భక్తులు స్వామికి సంపెంగ పుష్పాలు సమర్పించి, ప్రసాదంగా వాటిని తీసుకునేందుకు పోటీ పడతారు. స్వామికి సమర్పించిన తర్వాత ఆ పుష్పాలను తమ శిరస్సుల్లో ధరించడానికి ఆసక్తి చూపుతారు.
ఒడిశా భక్తుడు లక్ష్మీకాంత్ నాయక్ దాస్ సేవలు
ఏటా మూడు నెలల పాటు సింహగిరిపై ఉండి శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామికి సేవలందించే ఒడిశాకు చెందిన లక్ష్మీకాంత్ నాయక్ దాస్, ఆ కాలంలో స్వామికి పెద్ద మొత్తంలో సంపెంగ పుష్పాలను సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. ఆయన వస్తున్నారంటే సంపెంగలు వెంట తీసుకొస్తున్నారని నానుడి ఉంది.
సంపెంగ వ్యాపారం, స్వర్ణ పుష్పార్చన
సింహగిరిపై చిరు వ్యాపారులు సంపెంగ పుష్పాలను విడిగా, దండల రూపంలో విక్రయిస్తుంటారు. డిమాండ్ ఉన్న రోజుల్లో డజను పువ్వులు అరవై రూపాయల వరకు కూడా అమ్ముడవుతాయి. ఒక దాత సింహగిరిపై లభించిన 108 సంపెంగ పుష్పాలను అమెరికా తీసుకెళ్లి బంగారంలో ముంచి స్వర్ణ సంపెంగ పుష్పాలుగా మార్చి, సుమారు ఇరవై ఏళ్ల క్రితం సింహాచలేశుడికి కానుకగా సమర్పించారు. ఆ పుష్పాలతోనే 2019 వరకు స్వామికి ప్రతి గురువారం, ఆదివారం రోజుల్లో స్వర్ణపుష్పార్చన జరిగేది. ఆ తర్వాత కొత్తగా దాతల సహకారంతో మరిన్ని స్వర్ణపుష్పాలను అందుబాటులోకి తెచ్చారు.
అంతరించిపోతున్న సంపెంగలు
ఒకప్పుడు సింహగిరి కొండల్లో వేలాదిగా సంపెంగ చెట్లు ఉండేవని, రానురాను అవి అంతరించిపోతున్నాయని పలువురు చెబుతున్నారు. దేవస్థానం అధికారులు సంపెంగ చెట్ల పెంపకాన్ని ఎక్కువగా చేపట్టాలని పలువురు సూచిస్తున్నారు.

చందన స్వరూపునికి సంపెంగ సుగంధం

చందన స్వరూపునికి సంపెంగ సుగంధం

చందన స్వరూపునికి సంపెంగ సుగంధం