
న్యాయ శాస్త్ర నిఘంటువు.. వడ్లమాని
విశాఖ లీగల్: విశాఖలో న్యాయవాదిగా 65 ఏళ్లకు పైగా సేవలు అందించిన ప్రముఖ న్యాయవాది వడ్లమాని శ్రీరామ్మూర్తికి ఘన నివాళిగా ఆయన చిత్రపటాన్ని ఆవిష్కరించేందుకు విశాఖ న్యాయవాదుల సంఘం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ కార్యక్రమం సోమవారం సాయంత్రం 4 గంటలకు సంఘం నూతన భవనంలో జరగనుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మద్ది నారాయణరెడ్డి ముఖ్య అతిథిగా హాజరవుతున్నట్లు విశాఖ న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు ఎం.కె.శ్రీనివాస్ తెలిపారు. 1916లో ఉమ్మడి విశాఖ జిల్లా శ్రీరాంపురంలో జన్మించిన శ్రీరామ్మూర్తి.. విజయనగరం మహారాజా కళాశాలలో బీఏ పూర్తి చేశారు. అప్పట్లో అత్యధిక మార్కులతో ప్రథమ స్థానంలో నిలిచినందుకు ఆంధ్ర విశ్వ కళా పరిషత్ ఉపకులపతి ఆచార్య సర్వేపల్లి రాధాకృష్ణన్ చేతుల మీదుగా 3.5 తులాల బంగారు పతకాన్ని అందుకున్నారు. అనంతరం మద్రాసు న్యాయ కళాశాల నుంచి న్యాయశాస్త్రంలోనూ ప్రథమ స్థానంలో పట్టా పొందారు. 1940లో న్యాయకోవిదుడు మద్ది పట్టాభి రామిరెడ్డి వద్ద జూనియర్‌గా చేరారు. విశాఖలోనే ఉంటూ 2005 వరకు వేలాది కేసులను వాదించారు. న్యాయ శాస్త్రానికి నిఘంటువుగా నిలిచి.. న్యాయ ప్రక్రియకు సంబంధించిన ఎన్నో అంశాలను తన వాదనల ద్వారా వినిపించేవారు. ఆ రోజుల్లో శ్రీరామ్మూర్తి వాదనలు వినడానికి న్యాయమూర్తులతో పాటు ఇతర న్యాయవాదులు ఎంతో ఆసక్తి చూపేవారని, కోర్టు హాల్ మొత్తం కిటకిటలాడేదని ఆయన కుమారుడు అన్నయ్య శాస్త్రి గుర్తు చేసుకున్నారు. శ్రీరామ్ముర్తి అనేక ప్రభుత్వ శాఖలకు న్యాయ సలహాదారుడిగా పనిచేశారు. కేవలం ఆంధ్రప్రదేశ్ నుంచే కాకుండా దేశంలోని పలు ప్రాంతాల నుంచి కూడా న్యాయవాదులు, న్యాయమూర్తులు ఆయన సలహాలు, సూచనల కోసం వచ్చేవారు. ఆయన వాదించిన కేసుల్లో ఆంగ్లంలో ఎటువంటి క్లిష్టమైన పదాలు వాడకుండా సరళమైన భాషను ఉపయోగించడం ఆయన గొప్పతనానికి నిదర్శనమని సీనియర్ న్యాయవాదులు వ్యాఖ్యానించారు. అలా ఆయన ఎందరో న్యాయవాదులకు మార్గదర్శిగా నిలిచారు. చిత్రపట కార్యక్రమానికి విజయవంతం చేయాలని కార్యదర్శి ఎల్.పి.నాయుడు కోరారు.
నేడు విశాఖ న్యాయవాదుల సంఘంలో వడ్లమాని చిత్రపట ఆవిష్కరణ