
తల్లిపాలే బిడ్డకు ఆరోగ్య రక్ష
మహారాణిపేట: ఆంధ్ర మెడికల్ కళాశాల, కింగ్ జార్జ్ ఆస్పత్రి(కేజీహెచ్) పీడియాట్రిక్స్ విభాగం ఆధ్వర్యంలో ఆర్కే బీచ్ వద్ద తల్లిపాల అవగాహన ర్యాలీని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఐ.వాణి మాట్లాడుతూ బిడ్డ ఆరోగ్యానికి తల్లిపాలకు మించిన ఔషధం లేదన్నారు. మహిళలు పనిచేసే ప్రదేశాలలో బిడ్డకు తల్లిపాలు సులభంగా అందించేలా పటిష్ట ఏర్పాట్లు చేయాలన్నారు. కేజీహెచ్‌లో ఇప్పటికే బ్రెస్ట్ ఫీడింగ్ కార్నర్లు అందుబాటులో ఉన్నాయని, వీటి స్ఫూర్తితో మిగతా పని ప్రదేశాలు, పబ్లిక్ ప్రదేశాల్లో ఏర్పాటు చేస్తే మరింత ఉపయోగకరమని సూచించారు. సీఎస్‌ఆర్‌ఎంవో డాక్టర్ శ్రీహరి తల్లి పాలు ప్రాముఖ్యతను వివరించారు. కేజీహెచ్ పిల్లల విభాగాధిపతి డాక్టర్ బి.ఎస్.చక్రవర్తి మాట్లాడుతూ రెండేళ్ల వరకు పరిపూరక ఆహారంతో పాటు తల్లిపాలు కొనసాగించాలన్నారు. ఇది శిశువును అనేక రోగాల నుంచి కాపాడడంతోపాటు, మేధస్సు వృద్ధి, మాతా శిశు బంధానికి దోహదపడుతుందన్నారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ ప్రాజెక్ట్ అధికారి రామలక్ష్మి, అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ సందీప్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు రమణ మల్లి, సింధూర, రమ్య, తాతం నాయుడు, గిరిదొరలు హాజరయ్యారు. ర్యాలీలో 200 మంది అండర్ గ్రాడ్యుయేట్లు, పోస్ట్‌గ్రాడ్యుయేట్లు, 100 మందికి పైగా అంగన్‌వాడీ, ఆశా, ఇతర వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
ప్రపంచ తల్లిపాల అవగాహన వారోత్సవ ర్యాలీలో వైద్యులు