
ఆ.. టీచర్లకు కూటమి ఝలక్!
ఆరిలోవ: మండల విద్యాశాఖాధికారుల(ఎంఈవో) నియామకాల విషయంలో కూటమి ప్రభుత్వం జిల్లా పరిషత్, మున్సిపల్, కేజీబీవీ ఉపాధ్యాయులకు ఝలక్ ఇచ్చింది. కేవలం ప్రభుత్వ యాజమాన్యంలోని ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు(హెచ్‌ఎంలు), స్కూల్ అసిస్టెంట్లకు మాత్రమే ఎంఈవో–1 పోస్టులకు అవకాశం కల్పిస్తూ మార్గదర్శకాలు జారీ చేసింది. దీనిపై ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇది ఉమ్మడి సర్వీస్ నిబంధనలను ఉల్లంఘించడం, తమకు అన్యాయం చేయడమేనని జెడ్పీ, మున్సిపల్ హైస్కూళ్లు, కేజీబీవీ వంటి పాఠశాలల్లో పనిచేస్తున్న హెచ్‌ఎంలు, స్కూల్ అసిస్టెంట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఉమ్మడి సర్వీస్ రూల్స్‌కు గండి
గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ప్రతి మండలంలో ఎంఈవో–1, ఎంఈవో–2 పోస్టులను ఏర్పాటు చేసింది. దీని కింద ఉమ్మడి విశాఖ జిల్లాలోని 46 మండలాల్లో 92 మంది ఎంఈవోలు నియమితులయ్యారు. ప్రస్తుత విశాఖ జిల్లా పరిధిలోని 11 మండలాల్లో 22 మంది విధుల్లో ఉన్నారు. అయితే కూటమి ప్రభుత్వం జారీ చేసిన జీవో ప్రకారం.. రాష్ట్ర ప్రభుత్వ యాజమాన్యంలోని ఉన్నత పాఠశాలల్లో పని చేస్తున్న హెచ్‌ఎంలు, సీనియర్ స్కూల్ అసిస్టెంట్లకు మాత్రమే ఎంఈవో పోస్టులకు అవకాశం కల్పించారు. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను జారీ చేసి, వివరాలు సేకరించాలని జిల్లా అధికారులను ఆదేశించారు. ఈ నిర్ణయం వల్ల జెడ్పీ, మున్సిపల్, కేజీబీవీ వంటి ఇతర యాజమాన్యాల కింద పనిచేస్తున్న అర్హులైన ఉపాధ్యాయులు పదోన్నతి అవకాశాన్ని కోల్పోతారు. 2017లో అనుసరించిన విధంగానే కామన్ సీనియార్టీ ఆధారంగా ఎంఈవో పోస్టులను భర్తీ చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
ఉపాధ్యాయ సంఘాల ఆగ్రహం
జెడ్పీ, మున్సిపల్, ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులందరూ జిల్లా ఎంపిక కమిటీ(డీఎస్సీ) ద్వారా నియమితులైనవారే. వారందరిలో సీనియార్టీ ప్రకారం హెచ్‌ఎంలు, స్కూల్ అసిస్టెంట్లు ఎంఈవో పోస్టులకు అర్హులు. అయినప్పటికీ కామన్ రూల్స్ పాటించకుండా కేవలం ప్రభుత్వ పాఠశాలల వారికే అవకాశం ఇవ్వడం ద్వారా ప్రభుత్వం తమపై వివక్ష చూపుతోందని ఇతర యాజమాన్య ఉపాధ్యాయులు మండిపడుతున్నారు. కాగా.. ప్రస్తుతం ఉమ్మడి విశాఖ జిల్లాలో పని చేస్తున్న ఎంఈవోలందరూ పూర్తిస్థాయి అదనపు బాధ్యతల(ఎఫ్‌ఏసీ) కిందనే విధులు నిర్వర్తిస్తున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో అన్ని యాజమాన్యాలకు చెందిన 297 ఉన్నత పాఠశాలలు ఉండగా, వాటిలో ప్రభుత్వ యాజమాన్య పాఠశాలలు కేవలం 31 మాత్రమే. ఈ 31 పాఠశాలల్లోని కొద్ది మందికి మాత్రమే ఎంఈవోలుగా అవకాశం కల్పిస్తూ.. మిగిలిన 266 పాఠశాలల్లో పని చేస్తున్న వేలాది మంది ఉపాధ్యాయులను విస్మరించడం సరికాదని ఉపాధ్యాయ సంఘాలు పేర్కొంటున్నాయి.
ప్రభుత్వ యాజమాన్య హైస్కూల్ హెచ్‌ఎం,
ఎస్‌ఏలకు మాత్రమే ఎంఈవోలుగా అవకాశం
రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ
మిగిలిన యాజమాన్య టీచర్లపై వివక్ష
ఉపాధ్యాయ సంఘాల ఆగ్రహం
అన్ని మేనేజ్‌మెంట్లకు అవకాశం కల్పించాలి
అన్ని మేనేజ్‌మెంట్లకు చెందిన ఉన్నత పాఠశాలల్లో పనిచేస్తున్న హెచ్‌ఎంలకు, సీనియర్ స్కూల్ అసిస్టెంట్లకు ఎంఈవో–1గా అవకాశం కల్పించాలి. వారిని కూడా పూర్తిస్థాయి ఎంఈవోలుగా నియమించాలి. అలాంటప్పుడే మంచి విద్యా విధానం కొనసాగుతుంది. ఎఫ్‌ఏసీ బాధ్యతల వల్ల సక్రమంగా విధులు నిర్వహించక సరైన విద్యా ఫలితాలు రావడం లేదు. ప్రభుత్వం పునరాలోచించాలి.
– గోపీనాథ్, పీఆర్టీయూ ఉమ్మడి విశాఖ జిల్లా కన్వీనర్
సీనియార్టీ ద్వారా భర్తీ చేయాలి
ఎంఈవో–1 పోస్టులను ఉమ్మడి సీనియార్టీ ద్వారా మాత్రమే భర్తీ చేయాలి. ప్రభుత్వ యాజమాన్యంలో పనిచేస్తున్న హెచ్‌ఎంలు, స్కూల్ అసిస్టెంట్ల వివరాలు మాత్రమే సేకరించడం సరికాదు. ఉమ్మడి సర్వీస్ రూల్స్‌కు సంబంధించిన జీవో అమలు చేయాల్సి ఉండగా.. దాన్ని పక్కనపెట్టి ప్రభుత్వ అధికారులు పక్షపాత వైఖరితో వ్యవహరిస్తున్నారు. విద్యాశాఖ ఉన్నతాధికారులు జారీ చేసిన ఆదేశాలను ఉపసంహరించుకోవాలి.
–టి.ఆర్.అంబేడ్కర్,
యూటీఎఫ్ ప్రధాన కార్యదర్శి, విశాఖ జిల్లా
జెడ్పీ టీచర్లపై ఎందుకు వివక్ష?
ప్రభుత్వ యాజమాన్యంలో పని చేస్తున్న ఉపాధ్యాయులకు ఎంఈవో–1 బాధ్యతలు అప్పగించడం సరికాదు. ఇది జెడ్పీ హైస్కూల్ ఉపాధ్యాయులపై వివక్ష చూపడమే అవుతుంది. సర్వీస్ రూల్స్ సమస్య కారణంగా రెండు దశాబ్దాలుగా జెడ్పీ హైస్కూల్ ఉపాధ్యాయులు వివక్షకు గురవుతున్నారు. ప్రస్తుతం గైడ్‌లైన్స్ ప్రకారం ప్రభుత్వ యాజమాన్యంలోని జూనియర్లు కూడా ఎంఈవోలు అవుతారు. సీనియర్లయిన జెడ్పీ హై స్కూల్ ఉపాధ్యాయులు మాత్రం పదోన్నతి కోల్పోతారు. – ఇమంది పైడిరాజు, ఎస్టీయూ ప్రధాన కార్యదర్శి, విశాఖ

ఆ.. టీచర్లకు కూటమి ఝలక్!

ఆ.. టీచర్లకు కూటమి ఝలక్!

ఆ.. టీచర్లకు కూటమి ఝలక్!