
వెల్లివిరిసిన శ్రావణ శోభ
శ్రావణమాసం రెండో శుక్రవారం సందర్భంగా నగరం ఆధ్యాత్మిక శోభతో వెల్లివిరిసింది. బురుజుపేట కనకమహాలక్ష్మి అమ్మవారు స్వర్ణాలంకరణలో, కురుపాం మార్కెట్‌లోని కన్యకాపరమేశ్వరి సువర్ణవస్త్ర శోభితయై భక్తులకు కనువిందు చేశారు. సింహగిరిపై సింహవల్లీ తాయారుకు లక్ష కుంకుమార్చన చేశారు. తెల్లవారుజాము నుంచే ఆలయాలకు భక్తులు పోటెత్తారు. వేద మంత్రోచ్ఛారణల నడుమ అమ్మవార్లకు క్షీరాభిషేకాలు, సామూహిక కుంకుమ పూజలు, ప్రత్యేక పూజలు జరిగాయి.
స్వర్ణాలంకరణలో కనకమహాలక్ష్మి
డాబాగార్డెన్స్: శ్రావణ మాసం రెండో శుక్రవారం సందర్భంగా బురుజుపేటలోని కనకమహాలక్ష్మి ఆలయం ఆధ్యాత్మిక సందడి నెలకొంది. ఈ సందర్భంగా అమ్మవారిని స్వర్ణాలంకరణతో అద్భుతంగా అలంకరించారు. వేద మంత్రాలు, నాదస్వర వాయిద్యాల మధ్య ఉదయం 8.10 గంటలకు శ్రావణలక్ష్మి పూజలు మొదలయ్యాయి. ఈ పూజలో 103 మంది ఉభయదాతలు ప్రత్యక్షంగా పాల్గొనగా, 25 మంది ఉభయదాతలు పరోక్షంగా పూజలు చేయించుకున్నారు. వారికి కుంకుమ, ప్రసాదం పంపించారు. అమ్మవారిని దర్శించుకోవడానికి అధిక సంఖ్యలో భక్తులు, పలువురు ప్రముఖులు తరలివచ్చారు. శ్రావణ శుక్రవారం కావడంతో అమ్మవారి మూలవిరాట్‌కు ఉదయం 7 గంటల నుంచి 8 గంటల వరకు క్షీరాభిషేకం నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ ఈవో కె.శోభారాణి, ఏఈవో తిరుమలేశ్వరరావు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.
సువర్ణవస్త్రాలంకరణలో కన్యకాపరమేశ్వరి
పాతనగరం కురుపాం మార్కెట్ సమీపంలోని కన్యకాపరమేశ్వరి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. అమ్మవారి మూలవిరాట్‌కు వేకువజామున 5 గంటలకు శుద్ధజలం, పాలు, పెరుగు, తేనె, గంధం, పసుపు, కుంకుమ, వివిధ పండ్ల రసాలతో సహా 108 రకాల ద్రవ్యాలతో ప్రత్యేక క్షీరాభిషేకం నిర్వహించారు. అనంతరం అమ్మవారిని సువర్ణవస్త్రంతో అలంకరించి, 108 బంగారు పుష్పాలతో పూజలు జరిపారు. తర్వాత భక్తులకు అమ్మవారి దర్శనం కల్పించారు. ఆలయ ప్రాంగణంలో మహిళలు సామూహిక లలితా సహస్రనామ పారాయణం చేసిన తర్వాత, దేవస్థాన పురోహితుడు ఆర్‌బీబీ కుమార్‌శర్మ ఆధ్వర్యంలో సుమారు 250 మంది మహిళలు సామూహిక కుంకుమ పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ సంఘం అధ్యక్షుడు ఆరిశెట్టి దినకర్, కార్యదర్శి పెనుగొండ కామరాజు, శ్రావణమాస ఉత్సవ కార్యనిర్వాహక సభ్యులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
సింహగిరిపై లక్ష కుంకుమార్చన
సింహాచలం: శ్రావణ శుక్రవారం సందర్భంగా సింహగిరిపై కొలువైన శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి ఆలయంలో సింహవల్లీ తాయారు అమ్మవారికి లక్ష కుంకుమార్చనను వైభవంగా నిర్వహించారు. ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు సింహవల్లీ తాయారు, చతుర్బుజ తాయారు అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఆలయ ప్రాంగణంలోని వేదికపై ఉంచి శాస్త్రోక్తంగా ఈ పూజను చేపట్టారు. లక్ష నామాలతో అమ్మవార్లకు కుంకుమ పూజ నిర్వహించి.. విశేష హారతి ఇచ్చారు. ఈ పూజలో పాల్గొన్న భక్తులకు శేషవస్త్రాలు, కుంకుమ ప్రసాదం అందజేశారు. అలాగే.. సాయంత్రం అమ్మవారికి ఆలయ బేడామండపంలో తిరువీధిని ఘనంగా నిర్వహించారు. అనంతరం సహస్రనామార్చన పూజ కూడా వైభవంగా జరిగింది. శ్రావణ శుక్రవారం కావడంతో అమ్మవారి సన్నిధిని అందంగా అలంకరించారు.ఆలయ స్థానాచార్యులు టి.పి.రాజగోపాల్, ప్రధాన అర్చకుడు గొవర్తి శ్రీనివాసాచార్యులు ఈ పూజలు నిర్వహించారు. ఆలయ ఏఈవో తిరుమలేశ్వరరావు ఏర్పాట్లను పర్యవేక్షించారు.

వెల్లివిరిసిన శ్రావణ శోభ

వెల్లివిరిసిన శ్రావణ శోభ

వెల్లివిరిసిన శ్రావణ శోభ