
వృద్ధుడి నేత్రదానం.. ఇద్దరికి చూపు
పెందుర్తి: దాదాపు సంపూర్ణ జీవితం గడిపిన ఒక వృద్ధుడు మరణం తర్వాత కూడా ఇద్దరికి కంటి చూపును ప్రసాదించారు. పెందుర్తి మండలం చింతలగ్రహారానికి చెందిన కోరుబిల్లి అప్పారావు(90) వృద్ధాప్యం కారణంగా శుక్రవారం ఉదయం మరణించారు. ఈ విషయం తెలుసుకున్న పెందుర్తిలోని సాయి హెల్పింగ్ హ్యాండ్స్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు దాడి శ్రీనివాస్ మృతుడి కుమారుడు కోరుబిల్లి శ్రీనివాస్‌ను సంప్రదించి నేత్రదానం గురించి వివరించారు. దీనికి అంగీకరించిన శ్రీనివాస్ తన తండ్రి కళ్లను దానం చేయడానికి అంగీకరించారు. అనంతరం ఎల్‌వీ ప్రసాద్ మోషిన్ ఐ బ్యాంక్ ప్రతినిధులు అప్పారావుకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని నిర్ధారించుకుని ఆయన నేత్రాలను సేకరించి ఐ బ్యాంక్‌కు తరలించారు. ఆరోగ్య సమస్యలు లేకపోతే.. ఏ వయసు వారి నేత్రాలైనా కనీసం ఇద్దరికి చూపును అందించగలవని సాయి ట్రస్ట్ ప్రతినిధి శ్రీనివాస్ తెలిపారు.