
మాతా,శిశు మరణాలు సంభవించకుండా చర్యలు తీసుకోవాలి
మహారాణిపేట: జిల్లాలో మాతా, శిశు మరణాలు సంభవించకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ వైద్యాధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో మాతాశిశు సంక్షేమం, వ్యాధి నిరోధక టీకాలు, మలేరియా, డెంగ్యూ, ఎయిడ్స్ నియంత్రణ వంటి అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. నూతన దంపతులు, గర్భిణులు, శిశువుల రిజిస్ట్రేషన్‌లను సక్రమంగా నమోదు చేయాలని సూచించారు. ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎంలకు తగిన శిక్షణ ఇవ్వాలని, నిర్లక్ష్యం వహించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డీఎంహెచ్‌వో పి.జగదీశ్వరరావుకు సూచించారు. అబార్షన్లు అధికంగా చేస్తున్న ఆస్పత్రులపై నిఘా ఉంచి, వాటికి గల కారణాలపై నివేదిక సమర్పించాలని ఆదేశించారు. మలేరియా, డెంగ్యూ నివారణకు ప్రతి శుక్రవారం డ్రై డే పాటించాలన్నారు. కేజీహెచ్ సూపరింటెండెంట్ ఐ.వాణి, ఇతర అధికారులు పాల్గొన్నారు.