
వృక్షాబంధన్
138 ఏళ్ల మర్రిచెట్టుకు
రాఖీ కట్టిన వీఎంఆర్డీఏ కమిషనర్
తాటిచెట్లపాలెం: పర్యావరణ పరిరక్షణకు మహా వృక్షాలను కాపాడుకోవాలని, దీనికి గుర్తుగా వాటికి రాఖీ కట్టాలని వీఎంఆర్డీఏ కమిషనర్ కేఎస్ విశ్వనాథన్ పిలుపునిచ్చారు. రైల్వేస్టేషన్ రోడ్డులోని 138 ఏళ్ల మర్రిచెట్టుకు శుక్రవారం గ్రీన్ కై ్లమేట్ టీం ఆధ్వర్యంలో ఆయన రాఖీ కట్టి పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో జ్ఞానాపురం సెయింట్ జోసఫ్ కళాశాల, లిటిల్ ఏంజిల్స్ విద్యార్థినులు భాగస్వాములయ్యారు. ఈ సందర్భంగా విశ్వనాథన్ మాట్లాడుతూ.. ఈ మహా వృక్షానికి రాఖీ కట్టడం ద్వారా వృక్షాలను, పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యతను గుర్తు చేసుకోవాలన్నారు. కార్మిక శాఖ అసిస్టెంట్ కమిషనర్ మోహనలక్ష్మి మాట్లాడుతూ భూమిపై ఏ జీవి అంతరించినా దాని ప్రభావం మానవాళి మనుగడపై ఉంటుందని, సమస్త జీవరాశిని కాపాడాలని పిలుపునిచ్చారు. వృక్షాబంధన్ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా నిర్వహించి, ఎక్కువ మందిని భాగస్వాములను చేయాలని కోరారు. విశాఖపట్నం పోర్టు అథారిటీ ఉద్యానవన శాఖాధికారిణి రాధిక మాట్లాడుతూ తల్లి జన్మనిస్తే చెట్లు ప్రాణవాయువును ఇస్తున్నాయని, అందుకే చెట్లను కాపాడాలన్నారు. ఇందులో భాగంగా పోర్టు అథారిటీ 10 లక్షల మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టిందని తెలిపారు. అనంతరం విద్యార్థులు మర్రిచెట్టు చుట్టూ వలయంగా ఏర్పడి వృక్షాలను కాపాడుకుంటామని ప్రతిజ్ఞ చేశారు. వనమాలి సీటీజీ గ్రూప్ విద్యార్థులకు మొక్కలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో గ్రీన్ కై ్లమేట్ ఎన్జీవో వ్యవస్థాపక కార్యదర్శి జేవీ రత్నం, ఇతర ప్రతినిధులు, వివిధ సంస్థల అధికారులు పాల్గొన్నారు.

వృక్షాబంధన్