
కుళ్లిన చికెన్, గట్టిన చేపలు, మాగిపోయిన పీతలు, ముద్దగా మారిన రొయ్యలు, 15 రోజులకు పైగా నిల్వ ఉంచిన మసాలా ముద్దలు.. చదువుతుంటే ఎలా ఉంది?. కానీ, ఈ వీటితో తయారు చేసిన వంటకాలనే విశాఖపట్నంలోని ప్రముఖ రెస్టారెంట్‌లలో వడ్డిస్తున్నారంటే ఆశ్చర్యపోనక్కర్లేదు..
విశాఖలో ఇవాళ ఏకకాలంలో 20 చోట్ల ఫుడ్ సేఫ్టీ లీగల్ మెట్రాలజీ అధికారులు తనిఖీలు చేశారు. అక్కడ విస్తుపోయే దృశ్యాలు బయటపడ్డాయి. ఫ్రీజర్‌లలో రోజుల తరబడి నిల్వ చేసిన మాంసాలను ఉపయోగిస్తున్నారు. పైగా వాటిల్లో వాడే మసాలాలు నిల్వతో బూజుపట్టి ఉండడం గమనించారు. ఈ క్రమంలో.. క్వాలిటీలేని ఫుడ్‌ను విక్రయిస్తున్న వాళ్లపై అధికారుల సీరియస్ అయినట్లు సమాచారం.

జగదాంబ జంక్షన్ లోని ఆల్ఫా హోటల్ లో తనిఖీలు చేస్తున్న స్టేట్ ఫుడ్ సేఫ్టీ జాయింట్ డైరెక్టర్ పూర్ణచంద్రరావు, సిబ్బంది సాక్షి టీవీతో మాట్లాడారు. ‘‘ఇవాళ 20 మంది ఫుడ్ సేఫ్టీ అధికారులు, 20 మంది లీగల్ మెట్రాలజీ అధికారులతో తనిఖీలు చేస్తున్నాం. ఈ హోటల్‌లో ఫ్రీజ్ చేసిన ఫుడ్‌ని గుర్తించాం. వంటల్లో ఎక్కువగా కలర్స్ యూజ్ చేస్తున్నారు. కిచెన్‌లో పరిశుభ్రత పాటించడం లేదు.

ఇక్కడి ఫుడ్‌ని టెస్టింగ్ కోసం ల్యాబ్ కు పంపిస్తున్నాం. రిజల్ట్ వచ్చిన తర్వాత కేసులు నమోదు చేస్తాం. ఈ తనిఖీలు కంటిన్యూ అవుతాయి. నిబంధనలు పాటించని వాళ్లపై చర్యలు తీసుకుంటాం. పాయిజన్ ఫుడ్‌తో ప్రజల ఆరోగ్యాలతో చెలాగాటమాడేవాళ్లను క్షమించేది లేదు’’ అని హెచ్చరించారాయన.

