జనసేనలో ముసలం | - | Sakshi
Sakshi News home page

జనసేనలో ముసలం

Jul 30 2025 6:40 AM | Updated on Jul 30 2025 9:30 AM

జనసేనలో ముసలం

 కూటమిలో జనసేన నేతలకు విలువ లేదని చెప్పడమే ఆయన చేసిన తప్పిదం

 సమావేశంలోనే భీశెట్టి గోపీకృష్ణపై నాగబాబు ఆగ్రహం

 మైక్‌ లాక్కొని బయటకు గెంటేసిన జనసేన నేతలు

 తాజాగా ఫ్లోర్‌లీడర్‌ను మార్చాలని ఎమ్మెల్యే వంశీకృష్ణకు కార్పొరేటర్లు లేఖ

 పథకం ప్రకారమే చేస్తున్నారని పార్టీ శ్రేణుల్లో టాక్‌

విశాఖ సిటీ: జనసేన పార్టీలో ముసలం రాజుకుంది. ఆ పార్టీ జీవీఎంసీ ఫ్లోర్‌ లీడర్‌ భీశెట్టి వసంతలక్ష్మిపై వేటుకు రంగం సిద్ధమవుతోంది. కూటమిలో జనసేనకు విలువ లేదన్న వాస్తవాన్ని ఆమె భర్త చెప్పిన పాపానికి జనసేన పెద్దలు వారిపై కక్ష కట్టేశారు. బీసీ మహిళా నేతను పదవి నుంచి పక్కన పెట్టాలన్న నిర్ణయానికి వచ్చారు. కూటమిలో జనసేన ప్రాధాన్యత కోసం పార్టీ నేతలు, కార్యకర్తలు పట్టుబడుతుంటే.. దాన్ని పార్టీ ధిక్కార స్వరంగా అధినాయకులు పరిగణిస్తుండడం శ్రేణులను షాక్‌కు గురి చేస్తోంది. పార్టీ నేతల ఆత్మాభిమానాన్ని దెబ్బతీసేలా నిర్ణయాలు తీసుకుంటుండడం తీవ్ర చర్చకు దారిస్తోంది.

ప్రాధాన్యత లేదన్న పాపానికి..
కూటమి ప్రభుత్వంలో జనసేన నేతలకు, కార్యకర్తలకు విలువ లేకుండా పోయింది. సాక్షాత్తు జనసేన ఎమ్మెల్యేలు సైతం నియోజకవర్గాల్లో పనులు జరగడం లేదని అసంతృప్తి వ్యక్తం చేసిన సందర్భాలు అనేకమున్నాయి. పోలీస్‌స్టేషన్‌లో సిఫార్సు చేసిన వారికి పోస్టింగ్‌లు ఇవ్వలేదన్న కోపంతో పెందుర్తి జనసేన ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు గన్‌మెన్లను సరెండ్‌ చేసిన అంశం అప్పట్లో హట్‌ టాపిక్‌గా నిలిచింది. 

దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్‌ ఇప్పటికీ నియోజకవర్గంలో టీడీపీ ఇన్‌చార్జ్‌ సీతంరాజు సుధాకర్‌ పెత్తనానికి చెక్‌ పెట్టేందుకు కిందా మీదా పడుతూనే ఉన్నారు. ఎమ్మెల్యేల పరిస్థితే ఇలా ఉంటే.. ఇక పార్టీ నేతలు, ద్వితీయ స్థాయి నాయకులు పరిిస్థితి మరింత అధ్వానంగా మారింది. ఏ ప్రభుత్వ కార్యాలయంలోని చిన్న పని కూడా జరగని పరిస్థితి నెలకొంది. కూటమిలో ఆత్మగౌరవం కోసం జనసేన నేతలు గత ఏడాది కాలంగా పట్టుబడుతూనే ఉన్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే అనేక సార్లు పార్టీ అధినాయకుల దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం లేకుండా పోయింది.

 తాజాగా సీతంపేట ప్రాంతంలోని పార్టీ కార్యాలయంలో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ సోదరుడు, ఎమ్మెల్సీ నాగబాబు సమక్షంలో సమావేశం నిర్వహించారు. దీనికి జనసేన కార్పొరేటర్లతో పాటు నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు. ఇందులో జిల్లాలో నెలకొన్న పరిస్థితులపై కొందరు నేతలు గోడు చెప్పుకున్న పాపానికి నాగబాబు ఒంటి కాలిపై లేచారు. కూటమిలో తమకు విలువ ఇవ్వడం లేదని, తమ అభిప్రాయాలను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేసిన వారిపై వేటు వేయాలన్న నిర్ణయానికి వచ్చారు. ఎన్ని సమస్యలు వచ్చినా కూటమిలో సర్దుకొని పనిచేయాల్సిందే అని నాగబాబు తెగేసి చెప్పడంతో జనసేన నాయకులు, కార్యకర్తలు ఖంగుతిన్నారు.

చేతికి మట్టి అంటకుండా..
నాగబాబు సమావేశంలో జీవీఎంసీ జనసేన ఫ్లోర్‌ లీడర్‌ భీశెట్టి వసంతలక్ష్మి భర్త భీశెట్టి గోపీకృష్ణ పార్టీ పరిస్థితిపై మాట్లాడారు. కూటమిలో జనసేన పార్టీ నేతల అభిప్రాయాలకు విలువ ఇవ్వడం లేదని మాత్రమే చెప్పారు. ఇంతలో ఎమ్మెల్సీ నాగబాబు కల్పించుకుని గోపీకృష్ణపై ఫైర్‌ అయ్యారు. సమావేశం నుంచి వెళ్లిపోవాలని హుకుం జారీ చేశారు. వెంటనే అక్కడి నేతలు గోపీకృష్ణ చేతిలో ఉన్న మైక్‌ లాక్కున్నారు. అక్కడి నుంచి పంపించేశారు. దీంతో ఫ్లోర్‌లీడర్‌ భర్త అవమానభారంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు. 

కూటమిలో జనసేన ప్రాధాన్యత కోసం మాట్లాడుతుంటే.. దానికి మద్దతుగా నిలవాల్సిన పార్టీ పెద్దలు.. వారిపైనే ఆగ్రహం వ్యక్తం చేయడంతో అక్కడున్న వారంతా విస్తుపోయారు. ఇదిలా ఉంటే.. వెంటనే ఫ్లోర్‌లీడర్‌ భీశెట్టి వసంతలక్ష్మిని ఆ పదవి నుంచి తప్పించేందుకు ఏర్పాట్లు జరిగిపోతుండడం గమనార్హం. నాగబాబు సమావేశంలో ఆమె భర్త మాట్లాడడాన్ని పార్టీ పెద్దలు తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో పార్టీ పెద్దల చేతికి మట్టి అంటకుండా తెలివిగా కార్పొరేటర్లను ముందు పెట్టి కథను నడిపిస్తున్నారు. దీనిపై పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్‌కు లేఖ అందజేయడం ఇప్పుడు జనసేనలో హాట్‌ టాపిక్‌గా మారింది.

ఫ్లోర్‌ లీడర్‌పై ఆరోపణలతో లేఖ జీవీఎంసీ ఫ్లోర్‌ లీడర్‌ భీశెట్టి వసంతలక్ష్మిపై వేటుకు ప్లాన్‌ ఎమ్మెల్సీ నాగబాబు సమావేశంలో ఆమె భర్త ప్రశ్నించారనే అక్కసుతోనే..స్టాండింగ్‌ కమిటీలోనూ జనసేనకు నో చాన్స్‌ జీవీఎంసీ స్టాండింగ్‌ కమిటీ ఎన్నికల అంశం జనసేనలో అగ్గి రాజేస్తోంది. స్థాయీ సంఘంలో కూడా జనసేనకు ప్రాతినిథ్యం లేకుండా పోయింది. ఇందులో 10 స్థానాలు ఉండగా.. 9 టీడీపీ, ఒకటి బీజేపీ సర్దేసుకున్నాయి. జనసేనకు ఒక్క స్థానాన్ని కూడా కేటాయించకపోవడం గమనార్హం. ఇదిలా ఉంటే.. కొద్ది రోజుల క్రితం స్టాండింగ్‌ కమిటీ ఎన్నికలపై జనసేన ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు సమావేశం నిర్వహించి జనసేనకు మూడు స్థానాలను కేటాయిస్తున్నట్లు చెప్పారు. వీటిలో ఒకటి పెద్దిశెట్టి ఉషశ్రీ, మరొకటి మహమ్మద్‌ సాధిక్‌, మరొకరికి అవకాశం దక్కే ఛాన్స్‌ ఉందని ఆశ పెట్టారు. దీంతో ఆ కార్పొరేటర్లు ఊహల్లో తేలారు. చివరికి జనసేనకు ఒక్క స్థానాన్ని కూడా కేటాయించకపోవడంతో అందరూ నోరెళ్లబెట్టారు. అయితే 11వ సభ్యుడిగా సాధిక్‌ నామినేషన్‌ దాఖలు చేశారు. 10 మందిలో ఎవరైనా విత్‌డ్రా అయితేనే సాధిక్‌కు అవకాశం ఉంటుంది. లేకుంటే స్టాండింగ్‌ కమిటీలో జనసేనకు ప్రాతినిథ్యం లేకుండా పోతుంది.

జనసేన ఫ్లోర్‌లీడర్‌గా ఉషశ్రీ?
ప్రస్తుత ఫ్లోర్‌లీడర్‌ భీశెట్టి వసంతలక్ష్మిని ఆ పదవి నుంచి తప్పించడం ఖాయంగా కనిపిస్తోంది. ఆ స్థానంలో 43వ వార్డు కార్పొరేటర్‌ పెద్దిశెట్టి ఉషశ్రీ పేరును పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. వైఎస్సార్‌సీపీ నుంచి గెలిచిన ఆమె కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత జనసేనలోకి జంప్‌ అయ్యారు. డిప్యూటీ ఫ్లోర్‌లీడర్‌ పదవిని ఆశించి భంగపడ్డారు. కనీసం స్టాండింగ్‌ కమిటీలో అయినా ఛాన్స్‌ వస్తుందని ఆశపడ్డారు. అందులో జనసేనకు ప్రాతినిథ్యమే లేకపోవడంతో ఇప్పుడు ఫ్లోర్‌లీడర్‌పై కన్నేశారు. జనసేన పార్టీ పెద్దలు కూడా ఉషశ్రీ వైపే మొగ్గు చూపినట్లు సమాచారం. త్వరలోనే ఇందుకు సంబంధించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

పార్టీ పెద్దల స్కెచ్‌ ప్రకారం జనసేన కార్పొరేటర్లు ఎమ్మెల్యే వంశీకృష్ణకు లేఖ అందజేశారు. ఇందులో ఫ్లోర్‌లీడర్‌ భీశెట్టి వసంతలక్ష్మిని మార్చాలని పేర్కొన్నారు. ఆమె స్వప్రయోజనాలు, వారి సమస్యల పరిష్కారం కోసమే దృష్టి పెట్టారని ఆరోపించారు. మిగిలిన జనసేన కార్పొరేటర్లను నిర్లక్ష్యం చేశారని తెలిపారు. అలాగే ఆమెకు ఫ్లోర్‌లీడర్‌కు అవసరమైన అనుభవం, నాయకత్వ లక్షణాలు లేవని విమర్శించారు. ఈ పదవికి అనుభవజ్ఞుడైన వ్యక్తి అవసరమన్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం జీవీఎంసీలో జనసేనకు చెందిన 11 మందిలో ఒకరిని ఫ్లోర్‌ లీడర్‌గా నియమించాలని కోరారు. ఈ లేఖ వెనుక జనసేన పెద్దలు ఉన్నట్లు పార్టీ నేతలే గుసగుసలాడుకుంటున్నారు. అతడు పార్టీ నేతల తరఫున మాట్లాడిన పాపానికి వసంతలక్ష్మిపై వేటుకు రంగం సిద్ధం చేయడాన్ని తప్పుబడుతున్నారు. పార్టీ ఉనికి కోసం నేతలు పోరాటం చేస్తుంటే.. వారిపైనే వేటు వేస్తుండడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement