● బంధువులు, కార్మిక సంఘాల ఆందోళన
కూర్మన్నపాలెం : విధులు నిర్వహిస్తూ ఉక్కు కాంట్రాక్ట్ ఉద్యోగి మృతి చెందాడు. వివరాలివి. పెదగంట్యాడ దరి ముసలినాయుడుపాలెంలో నివాసం ఉంటున్న వేపాడ సూర్యవెంకటరమణ ఉక్కు కర్మాగారంలో కాంట్రాక్టర్ వద్ద ట్రాక్టర్ డైవర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. యథావిధిగా శుక్రవారం విధులకు హాజరై జోన్ ఎంఎంజెడ్‌లో ట్రాక్టర్‌ను నడుపుతుండగా గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. దీంతో సహచర కార్మికులు వైద్యులకు సమాచారం అందించి రప్పించారు. వైద్యులు పరీక్షించి మృతి చెందినట్టు నిర్ధారించారు. విషయం తెలుసుకున్న బంధువులు న్యాయం చేయాలని ఆందోళనకు దిగారు. దీంతో ఉక్కు ప్రధాన ద్వారం వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకుంది. బంధువులకు కార్మిక సంఘాలు మద్దతు తెలిపాయి. అదే సమయంలో అంబులెన్స్‌లో మృతదేహం ఉక్కు ప్రధాన గేటు వద్దకు చేరుకుంది. దీంతో అంబులెన్స్‌ను కదలనీయకుండా బంధువులు, కార్మికులు ఆందోళన చేశారు. కాంట్రాక్టర్, బంధువులతో పోలీసులు, యూనియన్ నేతలు చర్చలు జరి పారు. మృతుని బంధువులకు పరిహారం కింద రూ.2 లక్షలు, మట్టి ఖర్చుల నిమిత్తం మరో రూ.30 వేలు ఇవ్వడానికి ఒప్పందం కుదరడంతో ఆందోళకారులు శాంతించారు. మృతదేహాన్ని సొంత గ్రామమైన చోడవరం ప్రాంతానికి బంధువులు తీసుకువెళ్లారు.


