ఫైళ్లపై ‘డిస్కస్‌’ మంత్రం.. పరిష్కారానికి ఏళ్ల కాలం | - | Sakshi
Sakshi News home page

ఫైళ్లపై ‘డిస్కస్‌’ మంత్రం.. పరిష్కారానికి ఏళ్ల కాలం

Jan 5 2026 7:25 AM | Updated on Jan 5 2026 7:25 AM

ఫైళ్లపై ‘డిస్కస్‌’ మంత్రం.. పరిష్కారానికి ఏళ్ల కాలం

ఫైళ్లపై ‘డిస్కస్‌’ మంత్రం.. పరిష్కారానికి ఏళ్ల కాలం

● మోక్షం లేని భూ సమస్యలు ● భూ హక్కుల కోసం తిరుగుతున్న సామాన్యుడు ● మొద్దునిద్రలో రెవెన్యూ యంత్రాంగం

మహారాణిపేట: జిల్లాలో భూ సమస్యల పరిష్కారం గగనమవుతోంది. తహసీల్దార్‌ కార్యాలయం నుంచి కలెక్టరేట్‌ వరకు రెవెన్యూ వ్యవస్థ మొత్తం మొద్దునిద్ర పోతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సామాన్యుడు తన భూమి హక్కుల కోసం దరఖాస్తు చేసుకుంటే, పరిష్కారం కంటే కొర్రీలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. క్షేత్రస్థాయి నుంచి వచ్చిన దస్త్రాలను ఉన్నతాధికారులు కనీసం పరిశీలించకుండా ‘డిస్కస్‌’ అని రాసి పక్కన పెట్టడం లేదా బాధ్యత నుంచి తప్పించుకోవడానికి సీసీఎల్‌ఏ కార్యాలయానికి పంపడం పరిపాటిగా మారింది. ఫలితంగా ఒక్కో దస్త్రం పరిష్కారానికి నెలలు, ఏళ్లు పడుతోంది. జిల్లాలో డీఆర్‌వో, ఆర్డీవో వంటి కీలక పోస్టులు ఖాళీగా ఉండటం ఈ జాప్యానికి మరో ప్రధాన కారణమవుతోంది.

ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వస్తున్న వినతుల్లో అత్యధిక భాగం రెవెన్యూ శాఖకు చెందినవే ఉంటున్నాయి. తాజా సమావేశంలో వచ్చిన 413 వినతుల్లో 148 కేవలం రెవెన్యూ సమస్యలే కావడం గమనార్హం. కలెక్టర్‌, జాయింట్‌ కలెక్టర్లు స్వయంగా తహసీల్దార్లకు ఫోన్‌ చేసి ఆదేశిస్తున్నా, క్షేత్రస్థాయిలో పరిస్థితి మారడం లేదు. ముఖ్యంగా 11 తహసీల్దార్‌ కార్యాలయాల నుంచి వస్తున్న ఫిర్యాదులకు అంతులేకుండా పోతోంది. అర్జీదారులు ప్రతి వారం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా, అధికారులు సెలవులో ఉన్నారని లేదా బిజీగా ఉన్నారని సాకులు చెబుతూ వెనక్కి పంపుతున్నారు.

సాకులు చెబుతూ..: భూ దస్త్రాలను తాకడానికి అధికారులు భయపడటం జిల్లాలో వింత పరిస్థితిని సృష్టిస్తోంది. ఏ చిన్న సంతకం చేసినా ఎక్కడ తమ మెడకు చుట్టుకుంటుందోనన్న ఆందోళనతో ఫైళ్లను పెండింగ్‌లో పెడుతున్నారు. పాత రికార్డులు లేవని సాకులు చెప్పడం, ఆన్‌లైన్‌ ప్రక్రియలో కావాలని జాప్యం చేయడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. సాగులో ఉన్న భూములను సైతం ఆన్‌లైన్‌ చేయకపోవడంతో రైతు భరోసా వంటి పథకాలు అందక అన్నదాతలు ఇబ్బందులు పడుతున్నారు. దశాబ్దాలుగా అనుభవిస్తున్న భూములను అకస్మాత్తుగా ప్రభుత్వ భూముల జాబితాలోకి చేర్చడం, జీరో ఖాతాలకు మళ్లించడం వంటి చర్యలు భూస్వాములను బజారున పడేస్తున్నాయి.

రాజకీయ కోణం

వివాదాల్లేని జీరాయితీ భూములను కూడా రెవెన్యూ రికార్డుల్లో వివాదాల్లోకి నెట్టడం వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకసారి వివాదంలో పడిన భూమిని మళ్లీ సాధారణ స్థితికి తీసుకురావడం సామాన్యుడికి తలకు మించిన భారమవుతోంది. జిల్లాలో సర్వే నంబర్ల సబ్‌–డివిజన్‌ ప్రక్రియ సక్రమంగా జరిగితే సగం సమస్యలు తీరుతాయని తెలిసినా, ఆ దిశగా అడుగులు పడటం లేదు. ఫలితంగా వేలాది మంది ఇళ్లు కట్టుకున్నా రిజిస్ట్రేషన్లు లేక, ఆస్తులపై హక్కులు పొందే మార్గం లేక దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement