అయిననూ.. కట్టవలే..! | - | Sakshi
Sakshi News home page

అయిననూ.. కట్టవలే..!

Jun 13 2024 12:06 AM | Updated on Jun 13 2024 6:48 AM

అయిననూ.. కట్టవలే..!

అయిననూ.. కట్టవలే..!

‘బీహెచ్‌’ వాహనదారులు పన్ను చెల్లించాల్సిందే.. 

 లేకుంటే కేసు నమోదు.. సీజ్‌ 

 ఇతర రాష్ట్రాల్లో ఈ రిజిస్ట్రేషన్‌తో ఇక్కడ తిరుగుతున్న కార్లు 

 ఆంధ్రలోనూ ట్యాక్స్‌ చెల్లిస్తేనే అనుమతి 

 అడ్డదారుల్లో రిజిస్ట్రేషన్లు చేయించిన 14 మంది డీలర్‌షిప్‌ల రద్దు

సాక్షి, విశాఖపట్నం: ఒకే దేశం.. ఒకే రిజిస్ట్రేషన్‌ (వన్‌ నేషన్‌.. వన్‌ రిజిస్ట్రేషన్‌) విధానంతో కేంద్ర ప్రభుత్వం గతంలో బీహెచ్‌ రిజిస్ట్రేషన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. బీహెచ్‌ (భారత్‌) సిరీస్‌తో రిజిస్ట్రేషన్లు చేయించుకున్న వాహనాలు దేశంలో ఎక్కడైనా తిరగొచ్చన్న భావన పలువురిలో ఏర్పడింది. కేవలం కేంద్ర ప్రభుత్వం/ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులు/నాలుగు అంతకు మించి ఎక్కువ రాష్ట్రాల్లో కార్యాలయాలున్న ప్రైవేటు కంపెనీల ఉద్యోగుల వాహనాలకు మాత్రమే బీహెచ్‌ రిజిస్ట్రేషన్‌ వెసులుబాటు కల్పించారు. వీరు తాము పనిచేసే ప్రదేశం ఉన్న రాష్ట్రంలో లేదా శాశ్వత చిరునామా కలిగిన రాష్ట్రం, ఈ రెండింటిలో ఏ ప్రదేశంలో వాహనాన్ని ఉపయోగించాలనుకుంటారో ఆ రాష్ట్రంలో వాహనాన్ని రిజిస్ట్రేషన్‌ చేసుకొని, సంబంధిత రాష్ట్ర మోటారు వాహన పన్నును చెల్లించాల్సి ఉంటుంది. 

ఇతరులు ఈ బీహెచ్‌ రిజిస్ట్రేషన్‌ సిరీస్‌కు అర్హులు కాదు. అయితే కొంతమంది వ్యాపారులు, ఇతర ఉద్యోగులు స్థానికంగా ఉంటూ ఇతర రాష్ట్రాల్లో నివాసం ఉంటున్నట్టు తప్పుడు సర్టిఫికెట్లు సమర్పించి తమ వాహనాలకు బీహెచ్‌ రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారు. రాష్ట్రాలకు చెల్లించాల్సిన మోటారు వాహనాల పన్ను ఎగవేయవచ్చన్న ఉద్దేశంతో వీరు ఆ మార్గాన్ని ఎంచుకున్నారు. కొంతమంది వాహన డీలర్లు ఇలా అడ్డదారుల్లో బీహెచ్‌ సిరీస్‌ రిజిస్ట్రేషన్లు చేయించుకోవడంలో కీలకపాత్ర పోషించారు. నిబంధనల ప్రకారం ఈ సిరీస్‌ రిజిస్ట్రేషను నంబరు కలిగిన వాహనాలు ఆ రాష్ట్రంలోనే తిరిగేందుకు అనుమతి ఉంటుంది. ఇతర రాష్ట్రాల్లో తిరగాలంటే సంబంధిత రాష్ట్రానికి పన్ను చెల్లించాలి. 

కానీ కొంతమంది వాహనదారులు అరుణాచల్‌ప్రదేశ్‌ సహా మరికొన్ని రాష్ట్రాల్లో బీహెచ్‌ రిజిస్ట్రేషన్లు చేయించుకుని ఆంధ్రప్రదేశ్‌కు పన్ను చెల్లించకుండా మన రాష్ట్రంలోనూ తిరుగుతున్నట్టు రవాణా శాఖ అధికారులు కొన్నాళ్ల క్రితం గుర్తించారు. ఒక్క విశాఖపట్నం జిల్లాలోనే 400 వరకు ఇలాంటి వాహనాలున్నట్టు అంచనాకొచ్చారు. వీటిలో 80 శాతం నేవీ, 10 శాతం కేంద్ర ప్రభుత్వం/ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగుల వాహనాలు కాగా 10 శాతం వాహనాలు అడ్డదారుల్లో బీహెచ్‌ రిజిస్ట్రేషన్లు చేయించినవి ఉన్నాయి. రాష్ట్రానికి మోటారు వాహన పన్నులు చెల్లించకుండా తిరుగుతున్న వాహనదారులకు రవాణా శాఖ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఇలా ఇప్పటివరకు వీరిలో 35 మంది రూ.కోటి వరకు పన్ను చెల్లించారు.

లేదంటే ఏపీ రిజిస్ట్రేషనే..
ఇతర రాష్ట్రాల్లో బీహెచ్‌ రిజిస్ట్రేషన్లు చేయించుకుని రాష్ట్ర ప్రభుత్వానికి వాహన పన్ను చెల్లించకుండా విశాఖలో తిరుగుతున్న వాహనాలపై కేసులు నమోదు చేస్తామని రవాణా శాఖ ఉప కమిషనర్‌ జీసీ రాజారత్నం ‘సాక్షి’కి తెలిపారు. అంతేకాదు.. అలాంటి వాహనాలను సీజ్‌ చేసి వారి నుంచి పన్ను రికవరీకి చర్యలు చేపడతామన్నారు. లేనిపక్షంలో ఆ వాహనదారులు బీహెచ్‌ రిజిస్ట్రేషన్‌కు బదులు ఏపీ రిజిస్ట్రేషన్‌ మార్చుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. అలాగే నిబంధనలకు విరుద్ధంగా అడ్డదారుల్లో బీహెచ్‌ సిరీస్‌ రిజిస్ట్రేషన్లు చేయించిన 14 మంది వాహన డీలర్ల ఆథరైజేషన్‌ను సస్పెండ్‌ చేశామని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement