Sakshi News home page

సంక్రాంతి వేళ ‘మహాలక్ష్మి’!

Published Sun, Jan 14 2024 12:52 AM

విశాఖ బస్‌ కాంప్లెక్స్‌లో టికెట్‌ కౌంటర్‌ వద్ద ప్రయాణికుల రద్దీ - Sakshi

సాక్షి, విశాఖపట్నం: తెలంగాణలో మహలక్ష్మి పథకం సంక్రాంతి వేళ ఏపీఎస్‌ఆర్టీసీకి కాసులు కురిపిస్తోంది. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించేందుకు వీలుగా తెలంగాణ ప్రభుత్వం ఇటీవల మహాలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టింది. దీంతో ఆ రాష్ట్రంలో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే మహిళల సంఖ్య గణనీయంగా పెరిగింది. దీంతో అక్కడ ప్రయాణికుల అవసరాలను తీర్చడానికి ఆర్టీసీ బస్సుల సంఖ్యను పెంచాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో మునుపటిలా ఈ సంక్రాంతి పండగకు ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ దూర ప్రాంతాలకు తగినన్ని స్పెషల్‌ బస్సులను నడిపే అవకాశం టీఎస్‌ఆర్టీసీకి లేకుండా పోయింది.

దీనిని ఏపీఎస్‌ఆర్టీసీ అధికారులు అవకాశంగా మలుచుకున్నారు. హైదరాబాద్‌ నుంచి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు ఎక్కువ బస్సులను నడుపుతున్నారు. ఇలా ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి హైదరాబాద్‌, విజయవాడ, రాజమండ్రి తదితర దూర ప్రాంతాలకు మరిన్ని బస్సులను తిప్పుతున్నారు. గత సంక్రాంతికి ఉత్తరాంధ్ర నుంచి 450 స్పెషల్స్‌ తిప్పగా, ఈ సంక్రాంతికి ఆ సంఖ్య దాదాపు 650 వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు.

వీటిలో హైదరాబాద్‌ సర్వీసులే 150 వరకు ఉంటాయని చెబుతున్నారు. ఏటా సంక్రాంతి పండుగకు తెలంగాణలోని హైదరాబాద్‌ సహా ఇతర ప్రాంతాల నుంచి ఉత్తరాంధ్ర జిల్లాలకు పెద్ద సంఖ్యలో జనం వస్తుంటారు. వీరిని దృష్టిలో ఉంచుకుని ఈనెల 10వ తేదీ నుంచి 14 వరకు, తిరిగి 17 నుంచి 22 వరకు ప్రత్యేక బస్సులను నడుపుతున్నారు. 10 నుంచి 14 వరకు హైదరాబాద్‌, విజయవాడ, రాజమండ్రి తదితర ప్రాంతాల నుంచి ఉత్తరాంధ్ర జిల్లాలకు స్పెషల్స్‌ను అందుబాటులో ఉంచుతున్నారు. సంక్రాంతి తర్వాత 17 నుంచి 22 వరకు ఉత్తరాంధ్ర నుంచి హైదరాబాద్‌, విజయవాడ, రాజమండ్రి వైపు నడిపేందుకు నిర్ణయించారు.

80 శాతం ఓఆర్‌ హైదరాబాద్‌ నుంచి ఉమ్మడి విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు వచ్చే వారి కోసం ఏర్పాటు చేసిన బస్సుల్లో ప్రయాణికుల రద్దీ అధికంగానే ఉంటోంది. దీంతో ఈ బస్సులు జనంతో కిటకిటలాడుతూ కనిపిస్తున్నాయి. వీటిలో 80 శాతానికి పైగా ఆక్యుపెన్సీ రేషియో (ఓఆర్‌) ఉంటోంది. ఇది ఏపీఎస్‌ఆర్టీసీకి అదనపు ఆదాయాన్ని తెచ్చిపెడుతోంది.

గత ఏడాదికంటే ఈ సంక్రాంతికి డిమాండ్‌ ఎంతో మెరుగ్గా ఉందని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో మహాలక్ష్మి పథకం అమలుతో అక్కడ బస్సులు స్థానికుల అవసరాలకే సరిపోతున్నాయని, మునుపటిలా ఆంధ్రప్రదేశ్‌ సహా ఇతర రాష్ట్రాలకు సంక్రాంతికి అదనంగా బస్సులు నడిపే పరిస్థితి లేదని ఓ ఆర్టీసీ అధికారి శ్రీసాక్షిశ్రీకి చెప్పారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఏపీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం హైదరాబాద్‌ నుంచి గతంకంటే ఎక్కువ సర్వీసులను నడుపుతూ ప్రయాణికుల అవసరాలు తీరుస్తోందని వివరించారు. ఇప్పటికే పలువురు బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్లు చేయించుకున్నారు.

సమన్వయానికి అధికారులు..
మరోవైపు హైదరాబాద్‌లో ఉత్తరాంధ్ర సహా ఆంధ్ర ప్రాంతానికి నడిపే ఏపీఎస్‌ఆర్టీసీ బస్సులను సమన్వయం చేయడానికి, ప్రయాణికులకు సహకరించడానికి యాజమాన్యం ప్రత్యేక అధికారులను నియమించింది. వివిధ స్థాయిల అధికారులు హైదరాబాద్‌లోని ప్రధాన జంక్షన్లలో ఉంటూ స్పెషల్‌ సర్వీసులను పర్యవేక్షిస్తున్నారు.

మహాలక్ష్మి పథకంతో హైదరాబాద్‌లో తగ్గిన ఆర్టీసీ బస్సు సర్వీసులు

అందుకనుగుణంగా అటు నుంచి బస్సులను పెంచిన మన ఆర్టీసీ

గత సంక్రాంతికి ఉత్తరాంధ్ర నుంచి 450 సర్వీసులు

ఈసారి ఆ సంఖ్య 650 వరకు పెంపు

వీటిలో అధికంగా హైదరాబాద్‌ నుంచి నడుపుతున్న అధికారులు

సమన్వయం కోసం ఆర్టీసీ ప్రత్యేక అధికారుల నియామకం

Advertisement

What’s your opinion

Advertisement