కావాల్సిన బ్రాండ్‌ లేదన్నందుకు మద్యం దుకాణానికి నిప్పు

- - Sakshi

విశాఖపట్నం: తనకు కావాల్సిన బ్రాండ్‌ మద్యం లేదన్నందుకు ఆగ్రహించి మద్యం షాపునకు నిప్పుపెట్టాడు ఓ మందుబాబు. మద్యం సీసాలు ధ్వంసంగా కాగా మొత్తం రూ.2 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగింది. ఈ ఘటన పీఎం పాలెం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. సీఐ వై.రామకృష్ణ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మధురవాడ సాయిరాంకాలనీకి చెందిన జి.మధు(53) ఈ నెల 11వ తేదీ రాత్రి 9.30 గంటల సమయంలో కొమ్మాదిలో గల మద్యం షాపునకు వెళ్లాడు. ఓ బ్రాండ్‌ మద్యం ఇవ్వాల్సిందిగా కౌంటర్‌లో అడిగాడు.

ఆ బ్రాండ్‌ మద్యం తమ షాపులో లేదని చెప్పడంతో వారితో గొడవకు దిగాడు. షాపు మూసేసిన సమయంలో గొడవకు దిగవద్దని వారించినా.. పట్టించుకోకుండా షాపు తగలెట్టేస్తానని చెబుతూ మరింత రెచ్చిపోయాడు. అంతటితో ఆగకుండా ఓ బాటిల్లో పెట్రోలు తీసుకొచ్చి షాపు కౌంటర్‌పై కుమ్మరించి నిప్పు అంటించాడు. మంటలు చెలరేగడంతో మద్యం షాపు సిబ్బంది భయంతో బయటకు పరుగులు తీశారు. స్థానికులు అప్రమత్తమై నిందితుడు మధును పట్టుకున్నారు. విషయం తెలుసుకున్న స్థానిక సీఐ రామకృష్ణ సంఘటన స్థలానికి చేరుకొని నిందితుని అదుపులోకి తీసుకున్నారు.

ఈ ఘటనలో రూ.72,660 విలువ చేసే మద్యం బాటిళ్లు ధ్వంసం కాగా.. కంప్యూటర్‌, లాగ్‌ బాక్స్‌, సీసీ కెమెరా, క్యాష్‌ మెషీన్‌, పేటీఎం మెషీన్‌ కాలి బూడిదయ్యాయి. మొత్తం వీటి విలువ సుమారు రూ.2 లక్షలు ఉండవచ్చని సీఐ తెలిపారు. మద్యం షాపు ప్రతినిధి గండిబోయిన నరసింహులు ఫిర్యాదు మేరకు మధుపై హత్యాయత్నం కేసు నమోదు చేశామన్నారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఎకై ్సజ్‌ సీఐ మురళీధర్‌ సంఘటన స్థలాన్ని పరిశీలించారు.

 

Read latest Visakhapatnam News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top