నేటి నుంచి ఇంటర్ పరీక్షలు
కట్టుదిట్టమైన ఏర్పాట్లు
జిల్లా వ్యాప్తంగా 85 పరీక్ష కేంద్రాలు
80,956 మంది విద్యార్థులు
4 ఫ్లయింగ్ స్క్వాడ్, 4 సిట్టింగ్ స్క్వాడ్ బృందాల ఏర్పాటు
పరీక్షకేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు
ఇంటర్ బోర్డు ఆర్‌ఐవో మురళీధర్
మద్దిలపాలెం: జిల్లాలో సోమవారం నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ పరీక్షలకు పగడ్బందీగా ఏర్పాట్లు చేసినట్లు ఇంటర్మీడియట్ బోర్డు ప్రాంతీయ పర్యావేక్షణాధికారి మురళీధర్ ఆదివారం తెలిపారు. వచ్చే నెల 24వ తేదీ వరకు జరిగే ఈ పరీక్షల కోసం జిల్లా వ్యాప్తంగా 85 కేంద్రాలను సిద్ధం చేశామని, మొత్తం 80,956 మంది విద్యార్థులు హాజరుకానున్నారని వెల్లడించారు. వీరిలో ప్రథమ సంవత్సరం విద్యార్థులు 40,158 మంది ఉండగా, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 40,798 మంది పరీక్షలు రాయనున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని, విద్యార్థులు అరగంట ముందే కేటాయించిన సీట్లలో కూర్చోవాలని ఆయన సూచించారు. పరీక్షల నిర్వహణలో పారదర్శకత కోసం 85 కేంద్రాల్లోని 1,350 గదులలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామని, ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు వీటి ద్వారా లైవ్ స్ట్రీమింగ్ ఉంటుందని పేర్కొన్నారు. పరీక్షల పర్యవేక్షణకు నాలుగు ఫ్లయింగ్ స్క్వాడ్లు, నాలుగు సిట్టింగ్ స్క్వాడ్లను నియమించామన్నారు.
పరీక్షా కేంద్రాల్లోకి ఇన్విజిలేటర్లు, విద్యార్థులు ఎటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలు లేదా ఫోన్లు తీసుకురాకూడదని, కేవలం చీఫ్ సూపరింటెండెంట్లకు మాత్రమే కీప్యాడ్ ఫోన్లకు అనుమతి ఉందని స్పష్టం చేశారు. కేంద్రాల పరిధిలో 144 సెక్షన్ అమలులో ఉంటుందని, సమీపంలోని జిరాక్స్ కేంద్రాలను మూసివేయాలని ఆదేశించారు. విద్యార్థులకు ఏవైనా సందేహాలు లేదా సమస్యలు తలెత్తితే జిల్లా ఇంటర్ బోర్డు కంట్రోల్ రూమ్ నంబర్ 0891–2567561ను సంప్రదించాలని ఆర్‌ఐవో మురళీధర్ కోరారు.


