సీపీఎస్ రద్దుకు ఉద్యోగుల సమరశంఖం
బీచ్‌రోడ్డు: రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని (ఓపీఎస్) పునరుద్ధరించాలని ఆంధ్రప్రదేశ్ కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ (ఏపీసీపీఎస్‌ఈఏ) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కోరుకొండ సతీష్, సీఎం దాస్ డిమాండ్ చేశారు. సీపీఎస్ హక్కుల సాధన కోసం జిల్లా అధ్యక్షుడు గూనూరు శ్రీను ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఆదివారం ‘సాగర సంగ్రామ దీక్ష’ కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఎన్నికలకు ముందు చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కోరారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపు ఉద్యోగులందరితో చర్చించి వారికి ఆమోదయోగ్యమైన విధానాన్ని తీసుకువస్తామని హామీ ఇచ్చి, 18 నెలలు గడిచినా ఇప్పటివరకు చర్చల ప్రక్రియ కూడా ప్రారంభించకపోవడంపై వారు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఓపీఎస్ అమలు, ఇతర సమస్యల పరిష్కారం దిశగా అడుగులు వేయాలని హితవు పలికారు. మెమో 57, 57/05 అనుసరించి ఉపాధ్యాయులు, గ్రూప్–2, పోలీస్ తదితర శాఖల ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని వర్తింపజేయాలని వారు కోరారు. ముఖ్యంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తూ సర్వీస్ రెగ్యులర్ కాకుండానే చనిపోయిన ఉద్యోగుల కుటుంబాలకు ఫ్యామిలీ పెన్షన్ మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏపీసీపీఎస్‌ఈఏ గౌరవ సలహాదారు ఆర్. అప్పలరాజు, వివిధ జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు ప్రకాష్, త్రినాథ స్వామి, లోహితాస్యుడు, తెల్లబాబు, బాషా, మెంట రామారావు పాల్గొన్నారు. అలాగే ఏపీ ఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు కె.ఈశ్వరరావు, కార్యదర్శి జి.చంద్రరావు, ఏపీటీఎఫ్ నాయకులు టి.రామకృష్ణరావు, కరుణాకర్, పీఆర్టీయూ నాయకుడు గోపీనాథ్, కేజీహెచ్ నర్సెస్ వింగ్ ప్రెసిడెంట్ పద్మావతి, ఆంధ్రా యూనివర్సిటీ నాయకులు సాంబమూర్తి, గౌస్ బాబా తదితరులు తమ సంఘీభావాన్ని ప్రకటించారు.
సీపీఎస్ రద్దుకు ఉద్యోగుల సమరశంఖం


