Andhra Pradesh: Biryani For 10 Rupees In Visakhapatnam - Sakshi
Sakshi News home page

10 Rupee Biryani: రూ.10కే కడుపు నిండా భోజనం... రూ.10కే బిర్యానీ కూడా..

Published Mon, Jul 31 2023 12:48 AM

- - Sakshi

రూ.10కే కడుపు నిండా భోజనం. ప్రస్తుత రోజుల్లో ఇది వినడానికి కొంచెం ఆశ్చరంగానే ఉంటుంది. ఎందుకంటే హోటల్‌లో ఓ ప్లేటు భోజనం తినాలంటే రూ.100కు పైనే అవుతుంది. అంత మొత్తం చెల్లించుకోలేని పేద రోగుల సహాయకులకు వాల్తేర్‌ రౌండ్‌ టేబుల్‌ ఇండియా సంస్థ చైర్మన్‌ మక్సూద్‌ అహ్మద్‌ సహకారంతో.. స్వామి వివేకానంద స్వచ్ఛంద సేవా సంస్థ రూ.10కే సంతృప్తికర భోజనం అందిస్తోంది. ఎంతో మంది అనాథలు, అభాగ్యులకు ఆశ్రయం కల్పించిన ఈ సంస్థ ‘అన్నం పరబ్రహ్మ స్వరూపం’ అనే నానుడిని నమ్ముతూ.. ఎవరూ ఆకలితో ఉండకూడదన్న భావనతో ముందుకు సాగుతోంది. 

విశాఖపట్నంభాగ్యుల సేవలో అలుపన్నదే లేకుండా పయనిస్తోంది స్వామి వివేకానంద సంస్థ. కరోనా సమయంలో కూడా కేజీహెచ్‌లోని రోగుల సహాయకులు, జీవీఎంసీ పారిశుధ్య సిబ్బంది, వివిధ రైతుబజార్లలోని స్టాళ్లు నడుపుకునే రైతులకు ఆహారం అందజేసింది. వివేకానంద వృద్ధాశ్రమంలో నిత్యాన్నదానం కొనసాగుతోంది. సంస్థ గౌరవ అధ్యక్షుడు డాక్టర్‌ జహీర్‌ అహ్మద్‌ పర్యవేక్షణలో విస్తృతంగా సేవా కార్యక్రమాలు కొనసాగిస్తోంది. కాగా.. ఘోషాస్పత్రికి ప్రసవాల నిమిత్తం దూరప్రాంతాల నుంచి వచ్చే వారికి సరైన భోజనం లేక ఇబ్బంది పడుతున్నట్లు సంస్థ గుర్తించింది.

రోగుల సహాయకులకు అతి తక్కువ ధరకే ఆహారం అందించాలని సంకల్పించింది. ఫలితంగా ఈ ఏడాది ఫిబ్రవరి 13 నుంచి రూ.10కే భోజనం అందించే బృహత్తక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. వాల్తేరు రౌండ్‌ టేబుల్‌ ఇండియా సంస్థ చైర్మన్‌ మక్సూద్‌ అహ్మద్‌ సహకారంతో 150 రోజులకు పైగా ఘోషాస్పత్రిలో రోగుల సహాయకులకు ఆహారం అందజేస్తోంది. ‘అమృతాహార్‌’పేరిట అందిస్తున్న ఈ భోజనం నిజంగానే అమృతంలా ఉందని రోగుల సహాయకులు కొనియాడుతున్నారు. తొలుత ఇక్కడ రోజుకు 100 మందికి ఆహారం అందించేవారు.

క్రమంగా ఈ సంఖ్య పెరగడంతో 120కి పెంచారు. ఇంకా అవసరం అనుకుంటే ఈ సంఖ్యను మరింత పెంచుతామని వివేకానంద సంస్థ అధ్యక్షుడు సూరాడ అప్పారావు తెలిపారు. రోగుల సహాయకులు హోటళ్లలో అధిక ధరలు చెల్లించి ఆహారం కొనుగోలు చేయలేకపోవడం, ఇక్కడ క్యాంటీన్‌ సదుపాయం కూడా లేకపోవడం వల్ల ఈ కార్యక్రమం అమలు చేస్తున్నట్లు తెలిపారు. దాతలు ముందుకొస్తే.. ఉదయం అల్పాహారం, రాత్రి భోజనం కూడా అందజేసేందుకు ప్రయత్నిస్తామని వెల్లడించారు.

రుచిగా.. శుచిగా..
అన్నార్తుల కోసం తయారు చేసే ఆహారం రుచిగా, శుచిగా ఉండాలన్నది సంస్థ లక్ష్యం. అందుకే ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ‘అమ్మవంట’నూకాలమ్మ పర్యవేక్షణలో వివేకానంద సేవా సంస్థకు చెందిన మహిళలు వంట చేస్తున్నారు. వంట చేసే ప్రాంతంలోనే హరినామ సంకీర్తన చేస్తూ.. భోజనాన్ని శుభ్రంగా ప్యాక్‌ చేస్తారు. ఆటోలో ఘోషాస్పత్రికి తీసుకొచ్చి రోగుల సహాయకులకు అందజేస్తున్నారు.

ప్రతి 50 రోజులకు ఓసారి రూ.10కే బిర్యానీ
రోగుల సహాయకులకు రుచి, శుచికరమైన భోజనం అందించేందుకు మంచి రకం బియ్యం, నూనె వాడుతున్నాం. గ్యాస్‌తో కాకుండా ప్రత్యేకంగా తయారు చేసిన కట్టెల పొయ్యి మీద వంట చేస్తున్నాం. ఆ పొయ్యి ఖరీదు రూ.1.80 లక్షలు. ఈ కార్యక్రమానికి డి.సత్యనారాయణ, సీహెచ్‌ పోతురాజు, ఉమాదేవి, రాణి, సుజాత, భవానీ, నాగమణి, ర త్న, అచ్యుత, కనకమహాలక్ష్మి, డి.సత్యనారాయణ స్వచ్ఛందంగా సేవలందిస్తున్నారు. ప్రతీ 50 రోజులకు ఒకసారి రోగు ల సహాయకులకు రూ.10కే బిర్యా నీ అందజేస్తున్నాం. – సూరాడ అప్పారావు,

భోజనం బాగుంది
మా పాప డెలివరీ కోసం ఘోషాస్పత్రికి వచ్చాం. బయట మూడు పూటలా భోజనం కొనుక్కుని తినలేకపోతున్న సమయంలో.. ఇక్కడ రూ.10కే ఇస్తారని తెలిసిన వాళ్లు చెప్పారు. రెండు రోజులుగా ఇక్కడికి వచ్చి భోజనం తీసుకెళ్తున్నాను. భోజనం శుభ్రంగా.. ఇంట్లో చేసినట్లే ఉంది. నిర్వాహకులకు ధన్యవాదాలు.
– పద్మ, సింహాచలం

తక్కువ ధరకే మంచి భోజనం
మా అమ్మాయి ప్రసవం కోసం ఈ ఆస్పత్రికి వచ్చాం. ఇక్కడ రూ.10కే భోజనం ఇస్తున్నారని తెలిసి రెండు రోజులుగా తీసుకుంటున్నాను. భోజనం చాలా బాగుంది. ఈ రోజుల్లో పది రూపాయలకు ఏం వస్తుంది? ఇంత చక్కటి భోజనం తక్కువ ధరకే ఇస్తున్న వారు ధన్యులు.
– దానీలు, జెండాచెట్టువీధి

అన్నీ ప్రత్యేకమైన ప్యాక్‌లో..
వీలున్నప్పుడల్లా ఇక్కడ భోజనం చేస్తుంటాను. చాలా బాగుంటుంది. చక్కని ప్యాకింగ్‌లో భోజనం తీసుకొచ్చి అందజేస్తారు. పేషెంట్ల సహాయకులు ఇక్కడే ఏ చెట్టు కిందో కూర్చుని భోజనం చేస్తారు. అన్నం, కూరలు, సాంబారు అన్నీ ప్రత్యేకంగా ప్యాక్‌ చేయటం వల్ల సులువుగా శుభ్రం చేసుకునే వీలుంది.
–డి.గణేష్‌, స్వీపర్‌, ఘోషాస్పత్రి

పుణ్యమంతా వీళ్లదే..
మా మనవరాలు డెలివరీకి ఇక్కడికి వచ్చాం. ఇక్కడ రూ.10కే భోజనం పెడుతున్నారని తెలుసుకుని వచ్చాను. భోజనం చాలా బాగుంది. పుణ్యమంతా వీళ్లదే. ఉదయం, రాత్రి కూడా తక్కువ ధరకి ఆహారం ఇస్తే బాగుంటుంది.
– నక్కా సూరి అప్పాయమ్మ, మధురవాడ

రూ.10కే భోజనం.. గొప్ప విషయం
మాది దిబ్బపాలెం. పాప డెలివరీ కోసం ఇక్కడికి వచ్చాం. ఇక్కడ రూ.10కు భోజనం తీసుకుంటున్నాం. చాలా బాగుంది. రుచిగానే కాదు శుభ్రంగానూ ఉంది. పది రూపాయలకే ఇంత మంచి భోజనం పెడుతున్నారంటే గొప్ప విషయమే.
– వి. గౌరీ, దిబ్బపాలెం

పేదలకు ఉపయోగకరం
మా కోడలి పురిటికి ఇక్కడికి వచ్చాం. ఇక్కడంతా ఏం తెలియదు. భోజనానికి ఇబ్బంది పడుతుంటే ఎవరో ఇక్కడ రూ.10కే మంచి భోజనం పెడుతున్నారని చెప్పారు. రెండు రోజులుగా ఈ భోజనం తింటున్నాం. చాలా బాగుంది. పేదలకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.
–పిరిడి అప్పలనాయుడు, ఎస్‌.కోట

Advertisement
Advertisement