వికారాబాద్: కూరగాయల ధరలు సామాన్య ప్రజలకు భారంగా మారాయి. గతంలో ఎన్నడూలేని విధంగా రేట్లు పెరిగిపోయాయి. 15 రోజుల వ్యవధిలో కిలోకు ఏకంగా రూ.30 నుంచి రూ.40 వరకు పెరిగింది. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు లేక ఉష్ణోగ్రతలు పెరిగి కూరగాయల దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపింది. చాలా చోట్ల పంటలు పాడవడం, ఎండిపోవడం జరిగింది. ఇది కూడా ధరల పెరుగుదలకు కారణంగా చెప్పవచ్చు. రైతులకు పెద్దగా లాభం రాకపోయినా బహిరంగ మార్కెట్‌లో ధరలు మండిపోతున్నాయి. దళారులు లాభపడుతుండగా సామాన్యులపై భారం పడుతోంది.
కిలో రూ.80 పైమాటే..
ఉద్యాన శాఖ లెక్కల ప్రకారం ఖరీఫ్ సీజన్‌లో 27వేల ఎకరాల్లో కూరగాయల పంటలు సాగు చేశారు. జిల్లాలో క్యారెట్, టమాటా, బీట్రూట్, బెండ, చిక్కుడు, ఆకుకూరల సాగు చేశారు. సీజన్ ప్రారంభంలో వర్షాలు పడినా పంట చేతికొచ్చే దశలో వాన జాడ లేక ఎండిపోతున్నాయి. భూగర్భ జలాలు తగ్గిపోవడంతో దిగుబడి రాలేదు. టమాటా, ఉల్లి, క్యారెట్‌పై తీవ్ర ప్రభావం పడింది. ఏ కాయగూర చూసినా కిలో రూ.60 నుంచి రూ.80 పై మాటే. రోజురోజుకూ ధరలు పెరుగుతుండటంతో పేదలు, మధ్య తరగతి ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ఇప్పటికే బియ్యం రేట్లు ఆకాశాన్నంటాయి. క్వింటాలుపై ఏకంగా రూ.2 వేల వరకు పెంచేశారు. కందిపప్పు, చక్కర, ఆయిల్ ధరలు పెరిగి నానా అవస్థలు పడుతున్నారు. త్వరలో కార్తీకమాసం ప్రారంభం కానుండటంతో చాలామంది మాంసాహారానికి దూరంగా ఉంటారు. దీంతో సహజంగానే కూరగాయల వినియోగం అధికంగా ఉంటుంది. ఇలాంటి సమయంలో వీటి ధరలు పెరగడం ఆందోళన కలిగిస్తోంది.
పంటలకు తీవ్ర నష్టం
ఎండల తీవ్రతకు కూరగాయల పంటలు చాలా వరకు దెబ్బతిన్నాయి. క్యారెట్ పంట ఎదగలేదు. క్యారెట్ సైజు చిన్నగా మారింది. టమాటా చెట్టుపైనే ఎండిపోతోంది. ఆకుకూరల పైనా ప్రభావం కనిపిస్తోంది. బీట్రూట్, బెండ, చిక్కుడు, తదితర పంటలకు నష్టం వాటిల్లింది. దిగుబడులు లేక డిమాండుకు సరిపడా కూరగాయలు మార్కెట్లకు రావడం లేదు. వికారాబాద్ రైతు బజారులో ధర ఒకలాగా ఉంటే చిల్లర వ్యాపారులు వద్ద 10 నుంచి 20శాతం ఎక్కువగా ఉంది. ఈ లెక్కన ఏది కొన్నా కిలో రూ.80కి పైనే. ప్రభుత్వం ధరల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
వికారాబాద్ రైతు బజారులో ధరలు(కిలోకు..)
రకం 15రోజుల క్రితం ప్రస్తుతం
టమాటా 30 50
ఉల్లిగడ్డ 40 80
వంకాయ 40 80
పచ్చిమిర్చి 60 80
కాకరకాయ 40 80
చిక్కుడు 40 80
బెండ 60 80
గోరుచిక్కుడు 60 80
క్యారెట్ 40 80
కాలీఫ్లవర్ 40 80
దొండకాయ 40 80
బీట్రూట్ 50 80
క్యాప్సికమ్ 60 80
ఆలుగడ్డ 30 40
బీరకాయ 60 80
క్యాబేజీ 40 60
బీర్నీస్ 60 100
గోంగూర 60 80
పాలకూర 40 80
భారీగా పెరిగిన కూరగాయల ధరలు
ఎల్‌నినో ప్రభావంతో తగ్గిన దిగుబడి
డిమాండ్‌కు తగ్గ సరఫరా కాని వైనం
ఇప్పటికే బియ్యం రేట్లకు రెక్కలు
హడలిపోతున్న జనం


