కోస్గి డిపో మేనేజర్ రాజయ్య
బొంరాస్‌పేట: మారుతున్న ప్రయాణ సౌకర్యాలకు అనుగుణంగా తండాలకు సైతం ఆర్టీసీ బస్ సౌకర్యం కల్పిస్తున్నట్లు కోస్గి డిపో మేనేజర్ రాజయ్య తెలిపారు. మహబూబ్‌నగర్ ఎంపీ డీకే ఆరుణ సూచనల మేరకు బీజేపీ నాయకులు ఇచ్చిన విజ్ఞాపనకు ఆయన బుధవారం క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. మండల కేంద్రంతోపాటు మెట్లకుంట మీదుగా లోతికుంట తండాకు బస్సు రాకపోకల గురించి, అనువైన మార్గాల గురించి పరిశీలించారు. వీరశైవ సంఘం మండల అధ్యక్షుడు ఉప్పు జగదీశ్వర్, బీజేపీ నాయకులు రాజారాంరెడ్డి, సుధాకర్ డీఎంతో మాట్లాడి వినతిపత్రం అందజేశారు. తండాలకు బస్సు సౌకర్యం కల్పించాలని కోరారు.
ఇస్రో శాస్త్రవేత్త రఘువర్మ
బంట్వారం: శాస్త్ర సాంకేతిక రంగాలపై విద్యార్థులు అవగాహన పెంచుకోవాలని ఇస్రో శాస్త్రవేత్త రఘువర్మ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని పీఎంశ్రీ మోడల్ స్కూల్‌లో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉపగ్రహాలు, అంతరిక్షం, వాతావరణం, సమాచార వ్యవస్థలు, టెలివిజన్ ప్రసారాలపై అవగాహన కల్పించారు. జీపీఎస్ నావిగేషన్, వ్యవసాయం, ప్రకృతి వైపరీత్యాలు, ముందస్తు హెచ్చరికలు వంటి ఉపగ్రహాల ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరించారు. అంతరిక్ష పరిశోధనలపై ఆసక్తి పెంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ బ్యూలా, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
మీర్‌పేట: మత ప్రచారం చేస్తున్నారన్న కారణంతో మహిళలను దూషించి, దాడికి పాల్పడిన వ్యక్తిని బుధవారం మీర్‌పేట పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఇన్‌స్పెక్టర్ శోభన్ కథనం ప్రకారం. ఆగస్టు 6న అల్మాస్‌గూడ రాజీవ్‌గృహకల్ప సమీపంలోని మారుతీనగర్‌లో ఇద్దరు మహిళలు పిల్లలకు చాక్లెట్లు, ఓ మతానికి సంబంధించిన కరపత్రాలు పంపిణీ చేశారు. ఇది గమనించిన స్థానికుడు గొల్ల లక్ష్మీనారాయణ మహిళలను దూషిస్తూ, భౌతిక దాడిచేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో మంగళవారం స్థానిక వాట్సాప్ గ్రూపులలో వైరల్ కావడంతో అరుణజ్యోతి అనే మహిళ మీర్‌పేట పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. ఇద్దరు మహిళల వాంగ్మూలం తీసుకున్న పోలీసులు, దాడికి పాల్పడిన లక్ష్మీనారాయణపై కేసు నమోదు చేసి, రిమాండ్‌కు తరలించారు. ఇదిలా ఉండగా ఇరువర్గాల మద్దతుదారులు బుధవారం పోలీస్ స్టేషన్ వద్ద ప్రధాన రహదారిపై పోటాపోటీగా ధర్నా నిర్వహించారు. పరిస్థితి అదుపు తప్పుతుండడంతో పోలీసులు ఇరువర్గాలపై లాఠీఛార్జీ చేసి, పలువురిని స్టేషన్‌కు తరలించారు.
ఖమ్మం స్పోర్ట్స్: రాష్ట్రస్థాయి అండర్– 17 అథ్లెటిక్స్ పోటీలు ఖమ్మంలోని పోలీస్ పరేడ్ మైదానంలో బుధవారం ప్రారంభమయ్యాయి. రంగారెడ్డి డీఈఓ వాసంతి క్రీడా పతాకాన్ని ఎగురవేసిన మాట్లాడుతూ.. విద్యార్థుల్లో క్రీడా ప్రతిభ వెలికితీసేందుకు పోటీలు ఎంతగానో దోహదం చేస్తాయన్నారు. అనంతరం డీవైఎస్‌ఓ టి.సునీల్‌రెడ్డి మాట్లాడుతూ.. గెలుపోటములను సమానంగా తీసుకోవాలని సూచించారు. తొలిరోజు 1,500 మీటర్ల పరుగు పందెం పోటీ నిర్వహించారు. బాలుర విభాగం నుంచి ఎం.గణేష్(నల్లగొండ) ఎం.చరణ్ తేజ(ఆదిలాబాద్), వి.గణేశ్(రంగారెడ్డి), బాలికల విభాగంలో ఎండీ స్మిన్(కరీంనగర్), ఎం.రాజేశ్వరి(ఆదిలాబాద్), పి.నక్షత్ర(రంగారెడ్డి) మొదటి మూడు స్థానాలు కై వసం చేసుకున్నారు. కాగా, ఈ పోటీలు గురువారం కూడా కొనసాగనున్నాయి.


