నీటి గుంతలు.. మృత్యు కుహరాలు | - | Sakshi
Sakshi News home page

నీటి గుంతలు.. మృత్యు కుహరాలు

Nov 5 2026 8:50 AM | Updated on Nov 5 2026 8:50 AM

● జిల్లాలో వరుస విషాదాలు

● మూడు ఘటనల్లో ఏడుగురు మృతి

● బంట్వారం, ధారూరులో నలుగురు బలి

● పూడూరులో తల్లి, ఇద్దరు పిల్లల దుర్మరణం

● నివారణ చర్యలు చేపట్టని

అధికార యంత్రాంగం

బషీరాబాద్‌: జిల్లాలో నీటి గుంతలు మృత్యుకుహరాలుగా మారుతున్నాయి. ఈత సరదా.. పశువుల సంరక్షణ.. ఇతర అవసరాల కోసం నీటిలోకి దిగుతున్న వారు ప్రాణాలు కోల్పోతున్నారు. ముఖ్యంగా మైనింగ్‌ తవ్వకాలతో ఏర్పడిన లోతైన గుంతల్లో వర్షపు నీరు నిలిచి ప్రమాదాలకు కారణమవుతోంది. మూడు నెలల్లో చోటుచేసుకున్న వరుస ఘటనల్లో ఏడుగురు ప్రాణాలు కోల్పోవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ ఏడాడి అక్టోబర్‌ 3న పూడూరు మండలం సోమన్‌గుర్తి గ్రామ శివారులోని బావిలో మమత అనే మహిళ తన ఇద్దరు పిల్లలతో కలిసి మృతి చెందిన ఘటన కలకలం రేపింది. అక్టోబర్‌ 23న బంట్వారం మండలం బొపునారం సమీపంలోని క్వారీ గుంతలో ఈతకు వెళ్లిన కర్ణాటకకు చెందిన అజయ్‌(17), సురేందర్‌(17) నీటిలో మునిగి ప్రాణాలు వదిలారు. నవంబర్‌ 3న ధారూరు మండలం తరిగోపుల గ్రామ శివారులో గొర్రెలను కడిగేందుకు క్వారీ గుంతలో దిగిన అశోక్‌(19), శ్రీనివాస్‌(40) ప్రమాదవశాత్తు మృత్యువాతపడ్డారు.

పట్టించుకునేదెవరు?

క్వారీల్లో తవ్వకాలు పూర్తయిన తర్వాత ఏర్పడిన భారీ గుంతలను పూడ్చడం లేదు. వాటి చుట్టూ రక్షణ కంచెలు, ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడం లేదు. ఇలాంటి ప్రాంతాలపై సంబంధిత మైనింగ్‌ శాఖ అధికారుల పర్యవేక్షణ కొరవడటంతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఎన్నో కుటుంబాలను విషాదంలో మునిగిపోతున్నాయి.

నివారణకు చర్యలేవి..?

మైనింగ్‌, రెవెన్యూ, పంచాయతీరాజ్‌, పోలీసు శాఖలు సంయుక్తంగా ప్రమాదకర క్వారీ గుంతలు, బావులు, చెరువులను గుర్తించాలి. వాటి చుట్టూ కంచెలు ఏర్పాటు చేసి హెచ్చరిక బోర్డులు, రాత్రివేళ కనిపించే సూచికలు అమర్చాలి. నిరుపయోగ క్వారీ గుంతలను పూడ్చేలా యజమానులకు ఆదేశాలివ్వాలి. నిబంధనలు ఉల్లంఘించే వారిపై చర్యలు తీసుకోవాలి. గ్రామస్థాయిలో అవగాహన కల్పించి, అత్యవసర రక్షణ బృందాలను సిద్ధంగా ఉంచాలి. మరో ప్రాణం నీటిపాలవకముందే అధికారులు స్పందించాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement