తాండూరు రూరల్: వీబీజీ రామ్ జీ పథకంలో పని చేస్తున్న సిబ్బంది లోపాలను సరి చేసుకోవాలని అడిషనల్ డీఆర్‌డీఓ సత్తయ్య, జిల్లా విజిలెన్స్ అధికారి కుసుమ మాధురి సూచించారు. బుధవారం తాండూరు ఎంపీడీఓ కార్యాలయంలో 17వ విడత సామాజిక తనిఖీ ప్రజావేదిక కార్యక్రమం నిర్వహించారు. ఏప్రిల్ 2025 నుంచి మార్చి 2026 వరకు మండలంలోని రూ.4,43,78,000 విలువ చేసే పనులు జరిగాయి. ఈ నిధుల వినియోగంపై చర్చించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. నర్సరీలు, ఉపాధి పనుల రిజిస్టర్లను సక్రమంగా నిర్వహించాలని ఆదేశించారు. అడిగిన ప్రతి ఒక్కరికీ జాబ్ కార్డులు మంజూరు చేయాలని సూచించారు. సరైన లెక్కలు చూపని రూ.55 వేలను రికవరీ చేస్తామని చెప్పారు. ఎల్‌నినో నేపథ్యంలో కూలీలు ఇబ్బంది పడకుండా పనులు చేపట్టాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఏపీడీ నిర్మల, అసిస్టెంట్ విజిలెన్స్ అధికారి భార్గవి, స్టేట్ రిసోర్స్ పర్సన్ ప్రదీప్, ఎంపీడీఓ విశ్వప్రసాద్, ఏపీఓ నరోత్తంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కూలీలందరికీ జాబ్ కార్డులు
వీబీజీ రామ్ జీ పథకం ద్వారా గ్రామాల్లో అభివృద్ధి పనులు చేసుకునేందుకు మంచి అవకాశమని అడిషనల్ డీఆర్‌డీఓ సత్తయ్య అన్నారు. బుధవారం ఎంపీడీఓ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి కూలీకి జాబ్ కార్డు అందజేస్తామన్నారు. అడిగిన ప్రతి ఒక్కరికీ పని కల్పించి రోజుకు రూ.308 కూలి చెల్లిస్తామన్నారు. గ్రామాల్లో నీటి సంరక్షణ, భూగర్భ జలాల పెంపు, చెరువులు, కుంటల పునరుద్ధరణ, మౌలిక వసతుల కల్పన, పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన పనులు చేపడతామన్నారు. సర్పంచులు, కార్యదర్శులు ఉపాధి కూలీలతో పనులు చేయించుకొని అభివృద్ధికి పాటు పడాలన్నారు. అంగన్‌వాడీ భవన నిర్మాణం, పాఠశాల ప్రహరీ, మహిళాసమాఖ్య కార్యాలయం, బోరుబావుల రీ చార్జ్, ఫారమ్ పాండ్ పనులు చేయించాలని సూచించారు.
అడిగిన ప్రతి ఒక్కరికీ
జాబ్ కార్డు ఇవ్వాలి
రికార్డులు సక్రమంగా నిర్వహించాలి
అడిషనల్ డీఆర్‌డీఓ సత్తయ్య, జిల్లా విజిలెన్స్ అధికారి కుసుమ మాధురి


