శంకర్‌పల్లి: పెండింగ్ కేసుల దర్యాప్తులో వేగం పెంచాలని చేవెళ్ల డీసీపీ యోగేశ్ గౌతమ్ అన్నారు. మోకిల పోలీస్‌స్టేషన్‌ని శనివారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఠాణాలో సిబ్బంది ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి, బాధితుల కు సత్వరమే న్యాయం జరిగేలా చొరవ తీసుకోవాలన్నారు. రికార్డులను మొయింటైన్ చేయాలని, నిర్లక్ష్యం వహించిన వారిపై కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. గ్రామాలు, విల్లాలు, అపార్ట్‌మెంట్లలో సీసీ కెమెరాలు, రోడ్డు భద్రతపై విస్తృతంగా అవగాహన కల్పించాని సూచించారు. అనుమానిత వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. తనిఖీల సమయంలో మోకిల సీఐ శ్రీనివాస్ రెడ్డి, ఎస్‌ఐలు లక్ష్మణ్, సురేశ్, పద్మ, సిబ్బంది ఉన్నారు.
నిజాంపేట్: ట్రేడింగ్ పేరుతో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. సోషల్ మీడియా ప్రకటనలతో వల వేసి, నకిలీ యాప్‌లలో పెట్టుబడులు పెట్టించి రెండు వేర్వేరు ఘటనల్లో ఒక మహిళ నుంచి రూ.6.65 లక్షలు, రిటైర్డ్ ప్రొఫెసర్ నుంచి రూ.1.53 కోట్లు దోచుకున్నారు. బాధితులు అక్టోబర్ 30న సైబరాబాద్ సైబర్ క్రై మ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు తెలిపిన మేరకు.. ప్రగతినగర్ డాలర్ హిల్స్‌కు చెందిన రిటైర్డ్ ప్రొఫెసర్ శంకర తులసి రామ్ (69) ఫేస్‌బుక్‌లో కనిపించిన ట్రేడింగ్ ప్రకటనను క్లిక్‌చేశారు. జూలైలో ఓ వాట్సాప్ గ్రూపులో చేర్చారు. ప్రొఫెసర్ పేరుతో ఒకరు.. గ్రూప్ అనలిస్ట్‌గా మరొకరు సంప్రదింపులు జరిపారు.స్టాక్ మార్కెట్‌లో లాభాల పేరుతో భారీ లాభాలువస్తాయని ఆశచూపించారు. ఆగస్టు 22న రూ.90 వేలతో పెట్టుబడులు ప్రారంభించిన ఆయన సెప్టెంబర్ 18 వరకు మొత్తం 16 లావాదేవీల్లో రూ.1,53,85,000 బదిలీ చేశారు. ఆ తరువాత మోసపోయినట్లు గమనించి పోలీసులకు ఫిర్యాదుచేశారు. అలాగే ప్రగతినగర్‌లోని లేక్‌వ్యూ కాలనీకి చెందిన ఓ మహిళ (48) ఇన్‌స్ట్రాగామ్‌లో వచ్చిన ట్రేడింగ్ ప్రకటనను చూసి రూ.6.65లక్షలు మోసపోయింది.
పీసీబీ అధికారికి
బెదిరింపులు
సనత్‌నగర్: తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) అధికారికి బెదిరింపులు వచ్చిన ఘటన సనత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో కలకలం రేపింది. పీసీబీ కార్యాలయంలో పనిచేస్తున్న ఓ కీలక అధికారిని పర్యావరణ, సమాచార హక్కు కార్యకర్తనంటూ ఓ వ్యక్తి రూ.10 లక్షలు డిమాండ్ చేసినట్లు సమాచారం. ఈ ఘటనపై బాధిత అధికారి పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు పోలీసులు దీనిపై దర్యాప్తునకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది.


