వ్యర్థాలకు నిప్పు.. స్థానికులకు ముప్పు | - | Sakshi
Sakshi News home page

వ్యర్థాలకు నిప్పు.. స్థానికులకు ముప్పు

Oct 27 2026 8:28 AM | Updated on Oct 27 2026 8:28 AM

కొత్తూరు: పట్టణంలో ఉన్న ఓ పైపుల పరిశ్రమ నుంచి సోమవారం పెద్ద ఎత్తున మంటలు, నల్లటి పొగ వెలువడ్డాయి. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. కొందరు మంటల సమీపంలోకి వెళ్లి పరిశీలించారు. వ్యర్థాలకు నిప్పు అంటుకోవడంతో మంటలు, పొగ వ్యాపించినట్లు గుర్తించారు. ఇళ్లకు సమీపంలో ఉన్న పరిశ్రమల్లో ఇలాంటి వాటితో ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. సంబంధిత శాఖల అధికారులు స్పందించాలని కోరారు.

అనుమానాస్పదస్థితిలో యువకుడి మృతి

శ్రీనగర్‌కాలనీ: అనుమానాస్పదస్థితిలో ఓ యువకుడు మృతిచెందిన ఘటన మధురానగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం..విజయవాడకు చెందిన రమేష్‌ గుప్తా(35) ఆదిలాబాద్‌కు చెందిన ఇద్దరు, నర్సరావుపేటకు చెందిన యువకుడితో కలిసి సినీ కార్మికుడిగా పనిచేస్తూ యూసుఫ్‌గూడ ఎల్‌ఎన్‌నగర్‌లో నివాసముంటున్నాడు. సోమవారం పెంట్‌హౌస్‌ నుంచి దుర్వాసన రావడంతో ఓనర్‌ మధురానగర్‌ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. తలుపు తెరిచిచూసే సరికి రమేష్‌ మృతదేహం కుళ్లిపోయి కనిపించింది. రమేష్‌ స్నేహితులు ముగ్గురూ కొన్ని రోజులుగా కనిపించకుండా పరారీలో ఉన్నారు. హత్య చేసి పారిపోయారా లేక ఆత్మహత్య చేసుకున్నాడా అనే అంశాలపై క్లూస్‌టీంతో విచారణ చేపడుతున్నారు. ఘటనా స్థలాన్ని జూబ్లీహిల్స్‌ జోన్‌ డీసీపీ రమణారెడ్డి, ఏసీపీ వెంకటరెడ్డి, ఇన్‌స్పెక్టర్‌ ప్రభాకర్‌ పరిశీలించారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

బైక్‌ దొంగకు రిమాండ్‌

యాచారం: బైక్‌ దొంగను యాచారం పోలీసులు సోమవారం రిమాండ్‌కు తరలించారు. వివరాలివీ.. నల్లగొండ జిల్లా డిండి మండలం ఖానాపూర్‌ గ్రామానికి చెందిన కె.నవీన్‌ నగరంలోని సరూర్‌నగర్‌లో నివాసం ఉంటున్నాడు. జల్సాల కోసం పలు చోట్ల బైక్‌ల దొంగతనాలకు పాల్పడుతున్నాడు. ఆదివారం మాల్‌ మార్కెట్‌లో ఒక బైక్‌ను దొంగతనం చేస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. తమదైన శైలిలో విచారించగా గతంలో సరూర్‌నగర్‌, నాగోల్‌ తదితర పోలీస్‌స్టేషన్ల పరిధిలో పలు బైక్‌లను చోరీ చేయగా ఆరు కేసులు నమోదైనట్లు గుర్తించారు. కేసు నమోదు చేసిన యాచారం పోలీసులు సోమవారం నవీన్‌ను రిమాండ్‌కు తరలించారు.

బాలుడిని గాయపరిచిన

యువకుడిపై కేసు నమోదు

షాబాద్‌: తన చెల్లిని ఎందుకు దుర్భాషలాడావని ప్రశ్నించిన బాలుడిని గాయపరిచిన యువకుడిపై కేసు నమోదు చేసిన సంఘటన షాబాద్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ లక్ష్మిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని కుర్వగూడ గ్రామానికి చెందిన ఓ యువకుడు ఈ నెల 24న తన ఇంటి ముందు నుంచి వెళ్తున్న బాలికను దుర్భాషలాడాడు. బాలిక విషయాన్ని తన అన్నకు చెప్పగా అతను సదరు యువకుడిని నిలదీశాడు. దీంతో ఆ బాలుడిని యువకుడు చెక్క కర్రతో తలపై గాయపరిచాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితుడిని కోర్టులో హాజరు పరిచారు. సోమవారం రిమాండ్‌కు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement