సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీధర్
బంట్వారం: మత్స్యకారుల సంక్షేమానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని మత్స్య సహకార సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీధర్ అన్నారు. ఆదివారం కోట్‌పల్లి మండల కేంద్రంలో సంఘం సభ్యులతో మాట్లాడారు. ముదిరాజ్‌లు ఐకమత్యంగా ఉండాలన్నారు. కోట్‌పల్లి ప్రాజెక్టులో చేపలు పట్టడం ద్వారా రెట్టింపు ఆదాయం పొందాలన్నారు. మత్స్య శాఖ అధికారుల ఖాతాలో రూ.8 లక్షలు ఉన్నాయని వాటిని త్వరలోనే సంఘం సభ్యులకు పంచుతామన్నారు. సంఘంలో రూ.40 లక్షలకు పైగా దుర్వినియోగం జరిగిందని వాటిని రికవరీ చేసే వరకు పోరాడుతామన్నారు. కార్యక్రమంలో సంఘం మాజీ అధ్యక్షుడు నక్కలి బందెయ్య, సంఘం సభ్యులు పాల్గొన్నారు.
పరిగి: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం నాంచేరి గ్రామంలో నిర్వహించిన జిల్లాస్థాయి బాల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో ఆదివారం పరిగి ప్రగతి బాల్ బ్యాడ్మింటన్ అసోషియోషన్ జట్టు విజేతగా నిలిచి ప్రథమ బహుమతిని సొంతం చేసుకుంది. టోర్నీలో మొత్తం ఎనిమిది జట్లు పాల్గొన్న పరిగి జట్టు ప్రతిభ కనబరిచింది. రైల్వే క్రీడాకారుడు విజయ్‌కుమార్ విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ క్రీడాల్లో పాల్గొనాలని సూచించారు. మొదటి బహుమతి గెలుపొందిన క్రీడాకారులు లక్నాపూర్ శ్రీనివాస్, శ్రీశైలం, శంకర్‌రావు, ఖదీర్, నరేందర్, నరేష్, మాధవరెడ్డి, లక్ష్మయ్య, కార్తికేయను పలువురు అభినందించారు.
మర్పల్లి: దేశాన్ని యూనిట్‌గా కాకుండా రాష్ట్రాల వారీగా తీసుకొని నియోజకవర్గాల పెంపుపై పార్లమెంట్‌లో చర్చ చేయాలని బీసీ విద్యార్థి సంఘం జాతీయ జాయింట్ కన్వీనర్ ఈశ్వర్ కోరారు. ఆదివారం నగరంలో రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్యకు మర్యాద పూర్వకంగా కలిసి ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బీసీలకు రాజకీయంగా, ఆర్థికంగా, విద్యాపరంగా తీరని నష్టం జరుగుతోందని తెలిపారు. కేంద్రం యూనిట్‌గా తీసుకొని డీలిమిటేషన్ చేస్తే తెలంగాణలోని కొన్ని జిల్లాలకు నష్టం జరుగుతుందన్నారు. ఈ విషయాన్ని ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లి రాష్ట్రానికి న్యాయం జరిగేలా చూడాలని ఆర్ కృష్ణయ్యకు విజ్ఞప్తి చేశారు.
షాబాద్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జాతీయ అవార్డుకు మండలంలోని తాళ్లపల్లి గ్రామానికి చెందిన అప్పలి శ్రీనివాసులు ఎంపికయ్యారు. ఈ మేరకు ఆదివారం నగరంలోని బహుజన సాహిత్య అకాడమీ రాష్ట్ర కార్యాలయంలో జాతీయ అధ్యక్షుడు నల్లా రాధాకృష్ణ చేతుల మీదుగా ఎంపిక పత్రం అందుకున్నారు. ఈ సందర్భంగా అప్పలి శ్రీనివాసులు మాట్లాడుతూ.. అవార్డుకు ఎంపికవడం ఆనందంగా ఉందన్నారు. నవంబర్ 15న న్యూ ఢిల్లీలో జరిగే 20వ జాతీయ సదస్సులో ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో బీఎస్‌ఏ రాష్ట్ర నాయకులు మల్లగళ్ల మల్లేష్, కోటేశ్వరరావు, విజయ్‌కుమార్, విష్ణవర్ధన్, అవార్డుల ఎంపిక కమిటీ సభ్యులు, ప్రజా సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు చొక్కంపేట ఆంజనేయులు, సామాజిక ఉద్యమకారులు పాల్గొన్నారు.


