క్వింటాలు ఏ గ్రేడ్కు మద్దతు ధర రూ.8,667 సాధారణ రకానికి రూ.8,267 కొనుగోలు కేంద్రాలు 14 పంట సాగు 2,43,872 ఎకరాల్లో ఉత్పత్తి అంచనా 1.75లక్షల మెట్రిక్ టన్నులు
వికారాబాద్: పత్తి కొనుగోళ్లకు సీసీఐ అధికారులు కసరత్తు చేస్తున్నారు. వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల ఆధ్వర్యంలో ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించిన బాధ్యతలను అడిషనల్ కలెక్టర్ వెంకటాచారికి అప్పగించినట్లు సమాచారం. కొనుగోలు ఏర్పాట్లను సీసీఐ ఇప్పటికే ప్రారంభించారు. వానలు తగ్గుముఖం పట్టి ఎండలు ప్రారంభమైన నేపథ్యంలో మరో 15రోజుల్లో రైతులు పత్తి తీసే అవకాశం ఉంది. ఈ క్రమంలో పంట విస్తీర్ణం, ఉత్పత్తి అంచనా తదితర అంశాలపై అధికారులు దృష్టి సారించారు. జిల్లాలోని 14 కాటన్ మిల్లుల ద్వారా పత్తిని సేకరించాలని నిర్ణయించారు.
2.43లక్షల ఎకరాల్లో సాగు
జిల్లాలో 5,10,000 ఎకరాల్లో ఆయా పంటలు సాగువుతుండగా ఇందులో పత్తి పంటే ఎక్కవ. 1,25,000 మంది రైతులు 2,43,872 ఎకరాల్లో పంట వేశారు. ఎకరాకు సగటున ఆరు నుంచి ఎనిమిది క్వింటాళ్ల దిగుబడి రావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ లెక్కన 1.75లక్షల మెట్రిక్ టన్నులు వస్తుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. కాటన్ మిల్లుల్లో వేయింగ్ మిషన్లు, ఇతర సదుపాయాలు సిద్ధం చేసుకోవాలని అడిషనల్ కలెక్టర్ వెంకటాచారి సూచించారు.
బహిరంగ మార్కెట్లో..
మరో 20 రోజుల్లో పంట దిగుబడి చేతికిరానుంది. గత రెండు సీజన్లలో బహిరంగ మార్కెట్లలో అధిక ధరలు ఉండటంతో కొనుగోలు కేంద్రాలకు పత్తి అంతంత మాత్రంగానే వచ్చింది. ఈ ఏడాది ఓపెన్ మార్కెట్లో ధర తక్కువ ఉంది. ప్రభుత్వం క్వింటాలు ఏ గ్రేడ్కు రూ.8,667, సాధారణ రకానికి రూ.8,267 మద్దతు ధర ప్రకటించింది. ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో క్వింటాలు పత్తికి రూ.7 వేల నుంచి రూ.7,500 వరకు ధర పలుకుతోంది. కొనుగోళ్ల ప్రక్రియ ప్రారంభమయ్యేనాటికి ఈ ధరలు మరింత పడిపోయే అవకాశం ఉంది. దీంతో ఎక్కువ మంది రైతులు కొనుగోలు కేంద్రాల బాట పట్టవచ్చు.
ఇబ్బందులు తొలగేనా?
ఏటా పత్తి కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు ఇబ్బంది పడుతూనే వచ్చారు. సకాలంలో పత్తి సేకరించకపోవడంతో రోజుల తరబడి నిరీక్షించేవారు. వర్షాలకు పంట తడిసి నష్టపోయే వారు. ప్రతి సారీ ఇలాంటి సమస్యలు ఎదురవుతున్నా అధికారులు మాత్రం చర్యలు తీసుకోవడం లేదు. ఈ సారి ఇబ్బందులు లేకుండా చూడాలని రైతులు కోరుతున్నారు. వికారాబాద్, పరిగి వ్యవసాయ డివిజన్లలో పత్తి పంట ఎక్కువ సాగవుతున్నా అందుకు తగ్గట్లు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం లేదు. దీంతో ఎప్పుడూ రద్దీ ఉండేది. అయితే తక్కవ సాగయ్యే తాండూరు ప్రాంతంలో ఎక్కువగా కేంద్రాలు ఏర్పాటు చేయడంపై విమర్శలు ఉన్నాయి. పరిగి, పూడూరు మండలాల్లోనే కేంద్రాల్లో రైతులు తీవ్ర ఇబ్బందులు పడేవారు. ఈ బాధలు పడలేక చాలా మంది బహిరంగ మార్కెట్లలో పత్తి విక్రయించే వారు. వీటన్నింటిని పరిష్కరించాలని రైతులు కోరుతున్నారు.
నవంబర్ మొదటి వారంలో కొనుగోలుకు సన్నాహాలు
ఏర్పాట్లు చేస్తున్నాం
పత్తి సేకరణకు అన్ని ఏర్పా ట్లు చేస్తున్నాం. ఎంత దిగుబడి తెచ్చినా కొనుగోలు చే సేందుకు సిద్ధంగా ఉన్నాం. రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా చూస్తాం. అన్ని సదుపాయాలు కల్పించాలని కేంద్రాల నిర్వాహకులకు సూచించాం.
– వెంకటాచారి, అడిషనల్ కలెక్టర్


