అనుమానాస్పద స్థితిలో రైతు మృతి | - | Sakshi
Sakshi News home page

అనుమానాస్పద స్థితిలో రైతు మృతి

Oct 2 2026 7:26 AM | Updated on Oct 2 2026 7:26 AM

అనుమానాస్పద స్థితిలో రైతు మృతి కలప లారీ పట్టివేత కారు బోల్తా వయోవృద్ధులకు వైద్య పరీక్షలు భార్యతో గొడవపడి భర్త ఆత్మహత్య అర్ధరాత్రి అరుగులపై తిష్ట

బంట్వారం: అనుమానాస్పద స్థితిలో ఓ రైతు మృతి చెందాడు. ఈ ఘటన గురువారం మండలంలోని నూరుల్లాపూర్‌లో చోటుచేసుకుంది. మృతుడి కుటుంబీకులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. గ్రామానికి చెందిన రైతు సింగిడి రామిరెడ్డి(45) ఎప్పటి లాగానే ఉదయం పొలానికి వెళ్లాడు. భోజనానికి ఇంటికి రాకపోవడంతో సోదరుడు వెంకట్‌రెడ్డి పొలానికి వెళ్లి చూడగా బావిలో విగతజీవిగా కనిపించాడు. గ్రామస్తుల సహాయంతో రామిరెడ్డి మృతదేహాన్ని బయటకి తీశారు. ముఖంపై గాయాలు ఉండటంతో అనుమానం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ విమల ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. మృతుడికి భార్య శ్రీలత, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

కొడంగల్‌: దుద్యాల మండల కేంద్రంలోని పలు ప్రాంతాల్లో కొన్ని రోజులుగా విచ్చలవిడిగా చెట్ల నరికిపోవ జరుగుతోందని స్థానికులు గమనించి అధికారులకు సమాచారం అందించారు. దీంతో అటవీశాఖ అధికారులు క్షేత్రస్తాయి పరిశీలనకు దిగారు. గురువారం బీట్‌ అధికారి కార్తిక్‌రెడ్డి హైదరాబాద్‌కు చెందిన కలప లారీని పట్టుకొని కొడంగల్‌ అటవీశాఖ కార్యాలయానికి తరలించారు.

బొంరాస్‌పేట: మండల పరిధిలోని జాతీయ రహదారిపై గురువారం కారు బోల్తా పడింది. కర్ణాటక రాష్ట్రం వాడి నుంచి హైదరాబాద్‌కు వస్తున్న కారు లింగన్‌పల్లి గేటు మలుపు వద్ద బోల్తాపడింది. కారులోని వ్యక్తులను స్థానికులు బయటికి తీశారు. ప్రమాదంతో ఎవరికీ గాయాలు కాలేదు.

అనంతగిరి: జిల్లాలో వయోవృద్ధులకు వైద్య పరీక్షలు నిర్వహించినట్లు ఆ శాఖ జిల్లా అధికారి కాంతారావు గురువారం తెలిపారు. వయోవృద్ధుల వారోత్సవాలను పురస్కరించుకుని ఆయా ప్రాంతాల్లో వైద్య శిబిరాలు నిర్వహించినట్లు తెలిపారు. వికారాబాద్‌ పట్టణంలోని ప్రియదర్శిని, మహిమా మినిస్ట్రీస్‌ ఓల్డేజ్‌ హోమ్‌లలో వైద్య పరీక్షలు చేయించినట్లు చెప్పారు.

పహాడీషరీఫ్‌: భార్యతో గొడవపడిన భర్త ఆత్మహత్య చేసుకున్న సంఘటన బాలాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో గురువారం ఉదయం వెలుగుచూసింది. ఎస్‌ఐ సోహెల్‌ తెలిపిన వివరాల ప్రకారం.. ఎర్రకుంట తూర్‌ కాలనీకి చెందిన సమీర్‌ (23)కు ఏడాది క్రితం రేష్మాబేగంతో వివాహమైంది. తాగుడుకు బానిసైన సమీర్‌ నిత్యం భార్యతో గొడవపడేవాడు. ఈ క్రమంలోనే బుధవారం రాత్రి పూటుగా తాగి గొడవపడడంతో రేష్మా సమీపంలోనే నివాసం ఉండే ఆడపడుచు ఇంటికి వెళ్లింది. ఆతర్వాత గురువారం ఉదయం సమీర్‌ తన గదిలో ఉరేసుకొని ఉండడాన్ని గమనించిన పొరుగింటి వారు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న బాలాపూర్‌ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించగా, చున్నీతో ఫ్యాన్‌కు ఉరేసుకొని కనిపించాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు.

గంజాయి, మద్యం మత్తులో చోరీలు

పహాడీషరీఫ్‌: పహాడీషరీఫ్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని వాదే ముస్తఫా బస్తీవాసులు చిల్లర దొంగలతో బెంబేలెత్తుతున్నారు. బస్తీకి చెందిన కొందరు యువకులు రాత్రి పూట అరుగులపై అర్ధరాత్రి వరకు కూర్చొంటూ గంజాయి, మద్యం సేవిస్తూ చోరీలకు పాల్పడుతున్నారు. జల్సాలకు డబ్బులు లేకపోవడంతో నిర్మాణంలో ఉన్న ఇళ్లల్లో వైరింగ్‌, ఇతరత్రా వస్తువులను చోరీ చేస్తున్నారు. ఈ క్రమంలోనే బుధవారం రాత్రి షేక్‌ అల్తాఫ్‌ అనే వ్యక్తికి సంబంధించిన ఇంట్లో చొరబడి వైర్‌ ఎత్తుకెళ్లారు. ఈ విషయమై బాధితుడు పోలీసుల దృష్టికి తీసుకెళ్లాడు. బస్తీలో పెట్రోలింగ్‌ను ముమ్మరం చేసి, రాత్రి పూట యువకులు తిష్టవేయకుండా చర్యలు తీసుకోవాలని బస్తీవాసులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement