బషీరాబాద్: ‘ఇందిరమ్మ ఇళ్ల’ పేరుతో కాగ్నానది నుంచి పెద్దఎత్తున ఇసుక తరలిస్తున్నారని ఆరోపిస్తూ బషీరాబాద్ మండలం నావంద్గీ గ్రామస్తులు గురువారం ఆందోళనకు దిగారు. గ్రామ సర్పంచ్ శ్రీకాంత్‌తో కలిసి రైతులు వేణు పట్వారీ, రాజశేఖర్‌రెడ్డి, వీరణ్ణ, హన్మంతు, యువకులు ప్రభాకర్, నరేష్, మల్లారెడ్డి, సురేష్, అన్వర్, వెంకట్‌రెడ్డి, కిష్టప్ప తదితరులు రీచ్ వద్దకు చేరుకుని ఇసుక ట్రాక్టర్లను అడ్డుకున్నారు. అంతకుముందు తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపిన వారు.. ఇసుక రవాణాకు అనుమతులు నిలిపివేయాలని తహసీల్దార్ షాహెదాబేగంకు వినతిపత్రం అందజేశారు. ట్రాక్టర్లను అడ్డుకున్న తమను కొందరు బెదిరిస్తున్నారని రైతులు ఆరోపించారు. తనపై కొందరు ఇసుక మాఫియా వ్యక్తులు బషీరాబాద్‌లో దాడి చేశారని వేణు పట్వారీ అధికారులకు ఫిర్యాదు చేశారు.
ఇసుకే ముఖ్యమా..?
వర్షాలు సరిగా కురవక ఇప్పటికే పంటలు నష్టపోతున్నామని రైతులు తెలిపారు. నదిలో ఇసుకను భారీగా తవ్వితే భూగర్భ జలాలు మరింత అడుగంటిపోయి బోరుబావులు ఎండిపోయే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. పంటలతో పాటు భవిష్యత్ సాగునీటి వనరులు దెబ్బతింటే తమ పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. అయితే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు నావంద్గీ రీచ్ నుంచి ఇసుక తీసుకునేందుకు అనుమతులు గురువారమే ఇచ్చామని తహసీల్దార్ తెలిపారు. రైతుల ఫిర్యాదును ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని పేర్కొన్నారు.
బోరుబావులు అడుగంటాయని రైతుల ఆందోళన
కాగ్నానది రీచ్ వద్ద ట్రాక్టర్లను అడ్డుకున్న గ్రామస్తులు
తహసీల్దార్‌కు నావంద్గీ సర్పంచ్, రైతుల ఫిర్యాదు


