పథకం అమలు దిశగా అడుగులు
వికారాబాద్: యువ వికాసం పథకం అమలు దిశగా అడుగులు పడుతున్నాయి. ఇటీవల ప్రభుత్వం పథకాన్ని నెల రోజుల్లో ప్రారంభిస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో అధికారులు ఆ దిశగా చర్యలు చేపడుతున్నారు. 16 నెలల క్రితం అర్హులైన యువకుల నుంచి దరకాస్తులు స్వీకరించారు. మొదటి విడతలో భాగంగా నవంబర్ 19 నుంచి లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మూడు రోజుల క్రితం ప్రకటించారు. దీంతో యువతలో ఆశలు చిగురించాయి. గతేడాది జూన్ 2.. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజే లబ్ధిదారులకు చెక్కులు అందజేయాల్సి ఉన్నా కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. యువతకు స్వయం ఉపాధి కల్పించే ఉద్దేశంతో ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పేరుతో కొత్త పథకాన్ని తీసుకువచ్చిన విషయం తెలిసిందే. గతేడాది ఏప్రిల్ నెలలో దరఖాస్తులు స్వీకరించారు. వెరిఫికేషన్ కూడా పూర్తి చేశారు. జూన్ ఒకటో తేదీ నాటికి ప్రొసిడింగ్స్ సిద్ధం చేశారు. ఆ తర్వాత మిన్నకుండి పోయారు.
మొత్తం అర్జీలు 50,197
జిల్లాలోని 20 మండలాలు, నాలుగు మున్సిపాలిటీల నుంచి 50,197 దరఖాస్తులు వచ్చాయి. కొడంగల్ మున్సిపాలిటీలో అత్యల్పంగా 760 మంది మాత్రమే అర్జీలు ఇచ్చారు. తాండూరు మండలంలో అత్యధికంగా 3,456 మంది దరఖాస్తు చేశారు. మండలాలు, మున్సిపాలిటీలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్ల వారీగా విభజించి వెరిఫికేషన్ పూర్తి చేశారు. ఎంపిక చేసుకున్న యూనిట్ ఆధరంగా రూ.లక్ష నుంచి గరిష్టంగా రూ.4 లక్షల వరకు రాయితీపై రుణాలు ఇచ్చే అవకాశం ఉంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఒకే రకమైన రాయితీ వర్తింపజేయనున్నారు. ఈ సామాజిక వర్గాల వారికి రూ.లక్ష వరకు 90శాతం రాయితీపై రుణాలు ఇవ్వనున్నారు. రూ.2 లక్షల వరకు 80శాతం రాయితీ వర్తించనుంది. రూ.3 నుంచి రూ.4 లక్షల వరకు రుణం పొందే వారికి 70శాతం రాయితీ వర్తించనుంది. అయితే మొదటి విడతలో రూ.లక్ష వరకు ఇవ్వాలని నిర్ణయించారు.
నేతల కనుసన్నల్లోనే ఎంపిక..
ఎంపీడీఓల పర్యవేక్షణలో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ చేపట్టారు. ఇందులో బ్యాంకర్లను కూడా భాగస్వాములను చేస్తున్నారు. అయితే బ్యాంక్ సిబిల్ స్కోర్‌ను పరిగణలోకి తీసుకున్నట్లు తెలిసింది. ఎంపిక ప్రక్రియలో తమ ప్రమేయం ఉండదని, పారదర్శకంగా చేపడుతున్నామని అధికార పార్టీ ఎమ్మెల్యేలు, నేతలు అంటున్నారు. అయితే నేతల కనుసన్నల్లోనే లబ్ధిదారుల ఎంపిక జరిగిందనే ప్రచారం ఉంది. అప్పట్లో ఆశావహులు ఎమ్మెల్యేలు, అధికార పార్టీ నేతల చుట్టు ప్రదక్షిణలు చేశారు. ఇప్పడు మళ్లీ కదలిక రావడంతో హడావుడి మొదలైంది.
సామాజిక వర్గాల వారీగా ఇలా..
కార్పొరేషన్ యూనిట్లు దరఖాస్తులు
ఎస్సీ 4,812 11,595
ఎస్టీ 2,731 6,334
బీసీ 4,713 24,541
ఈబీసీ 1,235 ,055
మైనారిటీ 1,309 6,622
క్రిస్టియన్ మైనారిటీ 71 50
నవంబర్‌లో ప్రారంభిస్తామని ప్రకటించిన ప్రభుత్వం
దరఖాస్తుదారుల్లో చిగురిస్తున్న ఆశలు
జిల్లాలో వచ్చిన అర్జీలు 50,197
మంజూరైన యూనిట్లు 14,871
ఒక్కో యూనిట్‌కు గరిష్టంగా రూ.4 లక్షల వరకు ఇచ్చే అవకాశం
మండలాల వారీగా వచ్చిన దరఖాస్తులు
మండలం అర్జీలు
బంట్వారం 1,182
బషీరాబాద్ 2,125
బొంరాస్‌పేట్ 2,180
చౌడాపూర్ 1,741
ధారూరు 2,380
దోమ 3,136
దౌల్తాబాద్ 1,966
దుద్యాల్ 1,904
కొడంగల్ 2,156
కొడంగల్(మున్సిపల్) 760
కోట్‌పల్లి 1,141
కుల్కచర్ల 3,261
మర్పల్లి 1,964
మోమిన్‌పేట్ 1,804
నవాబుపేట్ 1,494
పరిగి 2,615
పరిగి(మున్సిపల్) 604
పెద్దేముల్ 3,150
పూడూరు 2,320
తాండూరు 3,402
తాండూరు(అర్బన్) 2,350
వికారాబాద్ 1,423
వికారాబాద్(అర్బన్) 2,903
యాలాల 2,236
మొత్తం 50,197


