పదిలో ఉత్తమ ఫలితాలు సాధించాలి | - | Sakshi
Sakshi News home page

పదిలో ఉత్తమ ఫలితాలు సాధించాలి

Sep 26 2026 7:41 AM | Updated on Sep 26 2026 7:41 AM

పదిలో ఉత్తమ ఫలితాలు సాధించాలి ఖోఖోలో సత్తా చాటిన గురుకుల విద్యార్థినులు చికిత్స పొందుతూ వ్యక్తి మృతి మహోన్నత వ్యక్తి దీన్‌దయాళ్‌

ఆర్‌జేడీ సోమిరెడ్డి

బంట్వారం: పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించాలని విద్యాశాఖ హైదరాబాద్‌ రీజినల్‌ జాయింట్‌ డైరెక్టర్‌ సోమిరెడ్డి సూచించారు. శుక్రవారం కోట్‌పల్లి పీఎంశ్రీ జెడ్పీహెచ్‌ఎస్‌ను సందర్శించారు. విద్యార్థులతో మాట్లాడారు. బాగా చదువుకొని ఉన్నత స్థాయికి చేరుకోవాలన్నారు. ప్రణాళికతో చదివితే అనుకున్నది సాధించడం పెద్ద కష్టమేమి కాదన్నారు. ఇప్పటి నుంచే ఒక లక్ష్యాన్ని పెట్టుకుని ముందుకు సాగాలన్నారు. చదువుతో పాటు క్రమశిక్షణ చాలా ముఖ్యమన్నారు. చెడు అలవాట్లకు, సెల్‌ఫోన్లకు దూరంగా ఉండాలన్నారు. ఏమైనా సమస్యలు ఉంటే చెప్పాలన్నారు. విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఉపాధ్యాయులకు సూచించారు. అనంతరం పలు అంశాలపై ఎంఈఓ చంద్రప్పతో చర్చించి సూచనలు చేశారు.

తాండూరు టౌన్‌: స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో గురువారం యాలాల మండల కేంద్రంలో నిర్వహించిన అండర్‌ –17 ఖోఖో పోటీల్లో తాండూరు గురుకుల బాలికల పాఠశాల విద్యార్థినులు సత్తా చాటారు. ఫైనల్‌లో టిజి మైనార్టీ బాలికల జట్టుపై నెగ్గి జిల్లా స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. గెలుపొందిన జట్టుకు వ్యాయామ ఉపాధ్యాయులు అనంతయ్య, రాజశేఖర్‌, రాజశేఖర్‌ రెడ్డి తదితరులు మెమొంటో, మెడల్స్‌ అందజేశారు. ప్రిన్సిపాల్‌ ప్రవీణ, ఉపాధ్యాయులు విద్యార్థినులను, పీఈటీ అఖిలను అభినందించారు. రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు.

ధారూరు: ఎద్దు పొడిచిన ఘటనలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ వ్యక్తి శుక్రవారం మృతి చెందాడు. ఎస్‌ఐ రాఘవేందర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని మోమిన్‌ఖుర్దు గ్రామానికి చెందిన బంటు శ్రీనివాస్‌(42) ఈ నెల 6న అదే గ్రామానికి చెందిన మల్లికార్జునరెడ్డి పొలం దున్నడానికి వెళ్లాడు. మధ్యాహ్నం భోజనం చేసేందుకు వెళుతూ కాడి నుంచి ఎద్దులను విప్పి కట్టేయడానికి తీసుకెళ్లాడు. ఈ క్రమంలో ఓ ఎద్దు బెదిరి బలంగా పొడిచి ఎత్తేసింది. తీవ్రంగా గాయపడిన శ్రీనివాస్‌ను పొలం యజమాని మల్లికార్జునరెడ్డి వికారాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించి శుక్రవారం మృతి చెందాడు. మృతుని భార్య సుగుణమ్మ ఫిర్యాదు మేరకు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.

బీజేపీ జిల్లా అధ్యక్షుడు రమేష్‌ కుమార్‌

తాండూరు టౌన్‌: అణగారిన వర్గాల జీవితాల్లో వెలుగులు నింపాలని పరితపించిన మహోన్నత వ్యక్తి పండిత్‌ దీన్‌దయాళ్‌జీ అని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రమేష్‌ కుమార్‌ అన్నారు. శుక్రవారం పార్టీ తాండూరు శాఖ ఆధ్వర్యంలో దీన్‌దయాళ్‌ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రచయితగా, రాజకీయ నాయకుడిగా ఆయన చేసేన సేవలను పలువురు కొనియాడారు. అందరికీ ఆదర్శనీయుడని అన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు కృష్ణముదిరాజ్‌, పటేల్‌ విజయ్‌, భద్రేశ్వర్‌, మల్లేశం, శ్రీకాంత్‌ రెడ్డి, అభిలాష్‌ పండిట్‌, సందీప్‌, రమేష్‌, శ్రీకాంత్‌, మల్లు, సాయిలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement