తాండూరు: సర్ ప్రక్రియలో భాగంగా నోటీసులు అందుకున్న ప్రతి ఓటరూ ధ్రువపత్రాలు అందించి ఓటు హక్కును కాపాడుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సీ సుదర్శన్‌రెడ్డి సూచించారు. శుక్రవారం తాండూరు మున్సిపాలిటీ, మండలంలోని గౌతాపూర్‌లోని పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ దీపక్ తివారి, అడిషనల్ కలెక్టర్ వెంకటాచారి, తాండూరు ఆర్డీఓ అనితతో కలిసి సందర్శించారు. మొదట తాండూరు ఆర్డీఓ కార్యాలయంలో పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. కలెక్టర్ పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. అనంతరం నియోజకవర్గం పరిధిలోని తహసీల్దార్లు, ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లతో ఎస్‌ఐఆర్‌పై సమీక్ష చేశారు. బీఎల్‌ఓల పనితీరు, ఇతర సమస్యలపై ఆరా తీశారు. అనంతరం పాత మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని సందర్శించారు. అక్కడ బీఎల్‌ఓలతో మాట్లాడారు. సర్ ప్రక్రియలో ఎలాంటి తప్పులు దొర్లకుండా ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు. ఓటర్లకు ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలన్నారు. ఆ తర్వాత ఎంపీటీ ఫంక్షన్ హాల్, గౌతాపూర్‌లోని పోలింగ్ స్టేషన్లను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ ముమ్మరంగా సాగుతున్నట్లు చెప్పారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 60శాతం మంది మ్యాపింగ్ కాని, అనామలీస్ ఓటర్లకు నోటీసులు జారీ చేసినట్లు వివరించారు. జిల్లాలో 72 శాతం మందికి ఇచ్చినట్లు తెలిపారు. ఆన్‌లైన్‌లో ఓటరుగా నమోదు చేసుకోవాడానికి అవకాశం ఉందన్నారు. లేదా స్థానికంగా ఉన్న బూత్ లెవల్ అధికారులకు ధ్రువ పత్రాలు అందజేస్తే వారు ఓటరుగా నమోదు చేస్తారని తెలిపారు. కార్యక్రమంలో తాండూరు డీఎస్పీ నర్సింగ్ యాదయ్య, పట్టణ సీఐ పరమేశ్వర్‌గౌడ్, మున్సిపల్ కమిషనర్ రాకేష్‌రెడ్డి, తహసీల్దార్ తారాసింగ్, ఎంపీడీఓలు పాల్గొన్నారు.
ప్రత్యేక దృష్టి సారించాలి
అనంతగిరి: సర్ ప్రక్రియలో భాగంగా ఓటరు మ్యాపింగ్, అనామలీస్‌పై ప్రత్యేక దృష్టి సారించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సీ సుదర్శన్ రెడ్డి, అన్నారు. శుక్రవారం కలెక్టర్ దీపక్ తివారితో కలిసి పట్టణంలోని ఆలంపల్లి, శివారెడ్డిపేట్ పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియను పరిశీలించారు. ఇప్పటి వరకు ఎంత మందికి నోటీసులు జారీ చేశారు.. ఇంకా ఎంత మందికి ఇవ్వాల్సి ఉందని బీఎల్‌ఓలను అడిగారు. అనంతరం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో వికారాబాద్, పరిగి, కొడంగల్ నియోజకవర్గాలకు చెందిన తహసీల్దార్లు, ఎన్నికల సిబ్బందితో సమావేశం నిర్వహించారు. అర్హుల ఓట్లు పోకుండా చూడాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. డబుల్ ఓట్లు, చిరునామా మార్పు తదితర వాటిని క్షుణ్ణంగా పరిశీలించాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ వెంకటాచారి, ట్రైనీ కలెక్టర్ సచిన్ బస్వరాజ్ గుట్టూరు, డీఎస్పీ అంజయ్య, డీఆర్‌ఓ స్వర్ణలత, ఆర్‌డీఓ వాసుచంద్ర తదితరలు పాల్గొన్నారు.
జిల్లాలో 72శాతం మందికి నోటీసులు ఇచ్చాం
త్వరలో ప్రక్రియను పూర్తి చేస్తాం
నోటీసులు అందుకున్న ప్రతి ఓటరూ స్పందించాలి
రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్‌రెడ్డి


