తాండూరు టౌన్: రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలకే అధికారం దక్కడం ఖాయమని తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు తీన్మార్ మల్లన్న అన్నారు. జిల్లాలో కొనసాగుతున్న పాదయాత్ర శుక్రవారం తాండూరుకు చేరుకుంది. పట్టణంలోని ఇందిరాచౌక్‌లో ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. పిడికెడు మంది లేని రెడ్లు, వెలమలకు అధికారాన్ని ఇవ్వడం మానేయాలన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు రాజకీయంగా ఎదిగి అధికారంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. నిజాం నవాబు పేదలకు భూములను పంచిపెట్టాలని చెబితే కొండా వెంకట రంగారెడ్డి రెడ్లు, వెలమలకు పంచి పెట్టారని ఆరోపించారు. మన రాజ్యం వచ్చాక రంగారెడ్డి జిల్లా పేరును తొలగించి, బీసీల పేరు పెడతామన్నారు. మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి అప్పు రూ.5 వేల కోట్లను కాంగ్రెస్ ప్రభుత్వం మాఫీ చేసిందన్నారు. మాట ఇచ్చి రిజర్వేషన్లు అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు భరోసా పథకానికి రూ.9 వేల కోట్ల అప్పు తెచ్చిన సీఎం.. రెడ్లు, వెలమలకు పెద్ద మొత్తంలో ఇచ్చారని మండిపడ్డారు. బీసీలపై అప్పు భారం వేశారని విమర్శించారు. ఆయా సంక్షేమ శాఖల గురుకులాల్లో చదివే పేద విద్యార్థులకు పెడుతున్న భోజనం ఖర్చు కంటే జైల్లో ఉన్న ఖైదీలు, పోలీసు కుక్కలకు పెడుతున్న భోజనం ఖర్చు ఎక్కువని అసహనం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణన సర్వేలో రాష్ట్ర వ్యాప్తంగా రెడ్లు, వెలమల జనాభా మాత్రమే పెరిగిందని, బీసీల జనాభా 20లక్షలు తగ్గిందని చూపెట్టడం అన్యాయమన్నారు. తాండూరుకు పక్క ప్రాంతాల నుంచి ఎమ్మెల్యే అభ్యర్థులను అరువు తెచ్చుకోవడం ఎందుకని, రాబోయే ఎన్నికల్లో తాండూరులో బీసీ అభ్యర్థినే ఎమ్మెల్యేగా ఎన్నుకుందామన్నారు. మన రాజ్యం రాగానే విద్య, వైద్యం ఉచితం చేస్తామన్నారు. బీసీలకు రెండెకరాల చొప్పున భూమి పంచుతామన్నారు. త్వరలో జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు రెడ్లకు, బీసీలకు మధ్య జరుగనున్న యుద్ధమన్నారు. ఈసారి మన అభ్యర్థినే ఎమ్మెల్సీగా గెలిపించాలని పిలుపునిచ్చారు. బీసీ ప్రభుత్వ ఉద్యోగులు చూపిస్తున్న చైతన్యానికి అభినందనలు తెలిపారు.
ధారూరులో రాత్రి బస
ధారూరు: మండల కేంద్రంలో గురువారం రాత్రి బస చేసిన తీన్మార్ మల్లన్న శుక్రవారం ఉదయం తన పాదయాత్రను తాండూరుకు కొనసాగించారు. మార్గమధ్యలో హోటల్స్, కిరాణా దుకాణాలు, కటింగ్ షాప్‌లకు వెళ్లి వాటి యజమానులతో మాట్లాడారు. బజ్జీలు వేసిన తోటి వారికి పంచిపెట్టారు.
పిడికెడు లేని అగ్రవర్గాలకేఅధికారం
టీఆర్‌పీ అధ్యక్షుడు తీన్మార్ మల్లన్న
తాండూరుకు చేరుకున్న పాదయాత్ర


