పరిగి: పరిగి – లక్నాపూర్ రోడ్డు పనులను వెంటనే పూర్తి చేయాలని ఆయా గ్రామాల ప్రజలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం మిట్టకోడూర్, చిగురాల్‌పల్లి, లక్నాపూర్, గోవిందాపూర్ గ్రామాల ప్రజలు పాదయాత్రతో నిరసన తెలిపారు. వీరిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. 2024లో రోడ్డు పనులను ప్రారంభించినా ఇప్పటి వరకు పూర్తి చేయలేదన్నారు. బాగున్న రోడ్డును తవ్వి వదిలివేయడంతో తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని తెలిపారు. ప్రజల ప్రాణాలు పోతున్నా అధికారులకు పట్టడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కల్వర్టుల నిర్మాణం కోసం తవ్వి మధ్యలో ఆపేయడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. శాంతియుతంగా పాదయాత్ర చేస్తుంటే పోలీసులు అడ్డుకోవడం సరికాదన్నారు. వెంటనే రోడ్డు పనులను ప్రారంభించి పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఆందోళన కార్యక్రమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం పంచాయితీరాజ్ అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.
పాదయాత్రతో నిరసన తెలిపిన పలు గ్రామాల ప్రజలు
అడ్డుకున్న పోలీసులు


